ప్రేమికుని మనసు గ్రహించకపోతే కష్టం

 

ప్రేమ గుడ్డిదంటారు! అది నిజమేనని తేల్చేందుకు చాలా పరిశోధనలే జరిగాయి. ప్రేమలో ఉన్నవారికి మిగతా ప్రపంచం సరిగా కనిపించదనీ, తమకి ఏం జరుగుతోందో పట్టదనీ ఈపాటికే తేలింది. ప్రేమలో ఉన్నప్పుడు మన శరీరంలో పనిచేసే హార్మోన్లే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రేమలో ఉన్నవారు అవతలివ్యక్తి భావాలని కూడా గమనించకపోతే ఎలా!

 

వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొంతమంది సైకాలజిస్టులు, ప్రేమికులు ఒకరి భావోద్వేగాలను మరొకరు సరిగా పసిగడుతున్నారా లేదా అనే విషయం మీద ఓ పరిశోధన నిర్వహించారు. ఇందుకోసం వారు ఏళ్ల తరబడి ప్రేమలో మునిగితేలుతున్న ఓ 120 మంది జంటలకు కొన్ని ప్రశ్నలను అడిగారు. వారి జవాబులని విశ్లేషించిన మీదట కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి.

 

- కొంతమంది వ్యక్తులకి కోపం వచ్చినప్పుడు... ఆ కోపాన్ని లోలోపచే అణచుకునే ప్రయత్నం చేస్తారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ వ్యక్తులలోని ముభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టీ వారికి కోపం వచ్చిందని తెలుసుకోవచ్చు. కానీ చాలామంది ప్రేమికులు ఈ విషయంలో అంతగా శ్రద్ధ చూపరని తేలింది.

 

- తమ కోపాన్ని దిగమింగుకునేవారి సంగతి ఇలా ఉంటే... మరికొందరేమో ఏం జరిగినా కూడా ‘అంతా మన మంచికే’ అనే సానుకూల స్వభావంతో ఉంటారు. దురదృష్టవశాత్తూ ఇలాంటివారి కోపాన్ని కూడా వారి ప్రేమికులు తక్కువగా అంచనా వేస్తారట. అన్నింటిలోనూ సానుకూలత చూపిస్తారు కాబట్టి, ఏం జరిగినా కూడా సానుకూలంగానే స్వీకరిస్తారులే అన్న తేలికభావంతో వీరిని తక్కువగా అంచనా వేస్తారట.

 

- ఒక వ్యక్తి తరచూ తన భావోద్వేగాన్ని ప్రకటించేవాడై ఉంటే... తనలో తాను ఏమీ దాచుకోకుండా తన ఉద్వేగాన్ని వెళ్లగక్కుతాడులే అన్న నమ్మకంతో ఉంటారట అవతలివారు.

 

- ఆడవారు తమ ప్రేమికునిలో ఎప్పుడూ సానుకూల దృక్పథాన్నే గమనిస్తారట. దాని వల్ల ఒకింత మేలు జరుగుతున్నప్పటికీ... వారి మనసుకి కష్టం కలిగినప్పుడు దాన్ని గ్రహించలేకపోయే ప్రమాదం ఉంది.

 

- స్త్రీలో పోలిస్తే మగవారు తమ భావోద్వేగాలను ఎక్కువగా కప్పిపుచ్చుతారని ఈ పరిశోధకులే ఇంతకుముందు నిరూపించారు. దీని వల్ల వారిని అంచనా వేసే అవకాశం తక్కువగా ఉంటుంది.

 

మనసులో ఉన్న అసంతృప్తిని బయటకి వెళ్లగక్కి విషయాన్ని తేల్చుకోకపోవడం వల్ల మున్ముందు చాలా సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. అలాగే అవతలి వ్యక్తిలోని భావోద్వేగాలను సరిగా పట్టించుకోకపోయినా కూడా బంధం బలహీనపడిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.