క్షమాపణ చెప్పడం ఒక కళ

 

ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే బంధం ఎల్లకాలం ఒకేలా ఉంటుందని అనుకోలేము. ఒక చిన్న మాటతోనో, అనుకోని చేతతోనో ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడవచ్చు. పట్టుదలకు పోయి ఆ స్పర్థను అలాగే వదిలేస్తే, విలువైన అనుబంధం కాస్తా చేజారిపోతుంది. తప్పు మనవైపు ఉంది అని మన విచక్షణ చెబుతున్నప్పుడు, మనం చెప్పే ఒక చిన్న క్షమాపణతో బంధాలు తిరిగి బలపడతాయి. అందుకే క్షమాపణ చెప్పడం కూడా ఒక కళ అంటున్నారు నిపుణులు. ఆ కళలోని కొన్ని మెలకువలు ఇవిగో...

 

వీలైనంత త్వరగా!

తప్పు మనదే అని తేలిపోయినప్పుడు వీలైనంత త్వరగా క్షమాపణ చెప్పేయడం మంచిదంటున్నారు. ఎందుకంటే కాలం గడిచేకొద్దీ, ఇద్దరి మధ్యా దూరం మరింతగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. పట్టుదలలు మరింత జటిలమయ్యే అవకాశం ఉంది. క్షమాపణకి ఎక్స్‌పైరీ డేట్ ఉండకపోవచ్చు. కానీ అప్పటికప్పుడు చెప్పే క్షమాపణలు మరిన్ని అపార్థాలకు దారితీయకుండా కాపాడతాయి.

 

మనస్ఫూర్తిగా చెప్పండి

అవతలివాళ్లు ఏడ్చిపోతున్నారనో, తప్పు బయటపడిపోయిందనో.... మొక్కుబడిగా క్షమాపణ చెబుతారు కొందరు. ఇలాంటి క్షమాపణలు అవతలివారు తప్పక పసిగట్టేస్తారు. దానివల్ల తాత్కాలికంగా సమస్య దూరమైనట్లు కనిపించినా, మీ గురించి ఏర్పడిన అపనమ్మకం మాత్రం వారి మనసులో అలాగే ఉండిపోతుంది. అందుకే... మీ గుండె లోతుల్లోంచి క్షమాపణలను అందించండి.

 

మొహమాటంగా ఉంటే

నేరుగా క్షమాపణ చెప్పేందుకు కొందరికి మొహమాటంగా ఉండవచ్చు. ఇలాంటప్పుడు ఉత్తరాలు రాయడమో, మెయిల్‌ చేయడమో చేస్తే సరి. అది కూడా కాదంటే, సెల్‌ఫోన్లు ఎలాగూ అందుబాటులో ఉన్నాయి కదా! మీ మనసులోని మాటను ఉన్నది ఉన్నట్లుగా అవతలివారికి మెసేజ్ చేయండి. అవతలి వారు జవాబు ఇవ్వరేమో అన్న సందేహం ఉంటే నేరుగా ఫోన్‌ చేసి మాట్లాడండి.

 

తప్పుని సరిదిద్దుకోండి

అవతలి వ్యక్తికి మాట ఇచ్చి నిలబెట్టుకోలేదా? వారి వస్తువుని ఏదన్నా పాడుచేశారా? వాళ్లు కోరుకున్న అవకాశాన్ని దూరం చేశారా? ఇలాంటి సందర్భాలలో మీ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉంటే కనుక తప్పక దాన్ని సరిదిద్దుకోండి. ఒకవేళ మాట జారడం వంటి సరిదిద్దుకోలేని తప్పు చేస్తే, మీరు చేసిన పని ఎంత పొరపాటో.... దాని వల్ల మీరు ఎంతగా బాధపడుతున్నారో తెలియచేయండి.

 

తీరులో తీవ్రత

చేసిన పొరపాటుని బట్టి క్షమాపణ చెప్పే తీరులో కూడా మార్పు ఉంటే బాగుంటుంది. ఏదో చిన్నపాటి పొరపాటైతే ‘నన్ను క్షమించు!’ అనేస్తే సరిపోతుంది. కానీ అదే చేయరాని పొరపాటైతే, అనకూడని మాట ఏదో అనేసి ఉంటే.... మరింత ఉద్వేగభరితమైన క్షమాపణలు అవసరం. ‘చాలా పొరపాటు జరిగిపోయింది. ఇంకెప్పుడూ అలా అనను...’ లాంటి దీనాలాపనలు తప్పవు. మరి బంధాలను కాపాడుకోవాలంటే, ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎలా! ‘నేను ఎందుకు చెప్పాలి అన్న అహంకారానికి పోతే, మిగిలేది ఒంటరితనమే!’

 

- నిర్జర.