పిల్లలు ఉప్పు తెగ తినేస్తున్నారు

 

ఉప్పు కిలో 400 రూపాయలకి చేరుకుందనే పుకారుతో దేశం తల్లడిల్లిపోయింది. ఉత్తరభారతంలో అయితే అర్ధరాత్రులు కూడా ఉప్పు సంచుల కోసం వీధుల మీద పడ్డారు. మన భారతీయులకి ఉప్పంటే ఎంత ప్రాణమో చెప్పేందుకు ఈ ఉదాహరణ ఒక్కటి చాలు. కానీ మన ప్రాణంగా చూసుకునే ఉప్పే అత్యంత ప్రాణాంతకంగా మారుతోందంటున్నారు. తాజాగా ముక్కుపచ్చలారని పిల్లలు సైతం ఎక్కువ ఉప్పుని తీసుకోవడం వల్ల అధిక రక్తపోటని ఎదుర్కొంటున్నారంటూ ఓ పరిశోధన వెలుగులోకి వచ్చింది.

 

అంతకు మించి:

పెద్దవారితో పోలిస్తే పిల్లలు కాస్త ఉప్పు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పటి ఆహారపు అలవాట్లను బట్టి పరిస్థితి కాస్త భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. బిస్కెట్లు, చిప్ప్, ఫాస్ట్‌ఫుడ్స్‌ అంటూ పిల్లలు అవసరానికి మించి ఉప్పుని లాగించేస్తున్నారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అమెరికాలో రెండువేలకు పైగా పిల్లల ఆహారపు అలవాట్లను గమనించారు. వీరంతా కూడా 6 నుంచి 18 ఏళ్ల వయసులోపు వారే. ఆశ్చర్యకరంగా వీరిలో 90 శాతం మంది పరిమితికి మించి ఉప్పుని తీసుకుంటున్నట్లు తేలింది.

 

దీర్ఘకాలిక సమస్యలు:

అధిక మోతాదులో ఉప్పు వల్ల మొదటగా కలిగే దుష్ఫలితం అధిక రక్తపోటు. అదే ఈ పిల్లలందరిలోనూ కనిపించడం బాధాకరం. ప్రతి తొమ్మిది మందిలోనూ ఒక పిల్లవాడిలో, అతని వయసుకి ఉండాల్సినదానికంటే వారిలో రక్తపోటు అధికంగా కనిపించింది. ఇలా చిన్న వయసులోనే రక్తపోటు ఛాయలు కనిపిస్తే అది వారిని జీవితాంతమూ వెంటాడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

 

కళ్లెం వేయాల్సిందే!

పిల్లలు ఎప్పుడు ఆహారాన్ని తీసుకున్నా, దానిని ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నా కూడా... సర్వత్రా ఉప్పే కనిపిస్తోందని పరిశోధకులు వాపోయారు. చిన్నప్పుడే ఎక్కువ ఉప్పు రుచికి అలవాటుపడిన పిల్లలలో ఆ రుచి ఒక వ్యసనంగా మారిపోతోందట. ఫలితంగా వారు పెద్దవారయ్యాక గుండెజబ్బులను సైతం ఎదుర్కొనే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లల ఆహారంలో పళ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతని ఇవ్వడం; వారికి అందించే చిరుతిండి ప్యాకెట్ల మీద సోడియం మోతాదుని గమనించడం; చిప్స్‌ వంటి చిరుతిళ్లకు వారిని దూరంగా ఉంచడం... వంటి చర్యలు పాటించి తీరమంటున్నారు.

 

మనకీ ఇది హెచ్చరికే!

ఇది కేవలం అమెరికాలో పరిస్థితి అనుకోవడానికి లేదు. అసలే భారతీయ వంటకాలలో ఉప్పుకి అధిక ప్రాధాన్యత ఉంటుంది. దీనికి తోడు ఇప్పటి తరానికి ఫాస్ట్‌ఫుడ్స్‌ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది. పైగా చదువు తప్ప ఎలాంటి వ్యాయామమూ ఎరుగని కాలం ఇది. కాబట్టి భవిష్యత్తులో వారి కెరీర్‌ గురించి ఎంత కంగారు పడుతున్నామో, వారి ఆరోగ్యం గురించి అంతకుమించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకోసం అటు వారి ఆహారపు అలవాట్లను నిశితంగా గమనిస్తూ, ఇటు ఇంట్లోనూ ఉప్పు వాడకం తగినంతగా తగ్గించుకుంటే మేలు.