హోటల్కి వెళ్తే సర్వీస్ చార్జ్ కట్టాలా?

 

పుట్టినరోజనో, ప్రమోషన్ వచ్చిందనో... కారణం ఏదైతేనేం! కుటుంబంతో కాస్త సరదాగా గడపాలి అనుకుంటే అలా రెస్టారెంటుకి వెళ్తాం. కానీ బిల్లు కట్టాల్సి వచ్చేసరికి ఆ సరదా కాస్తా తీరిపోతుంది. వందల్లో కనిపించే బిల్లు, ఆ బిల్లు మీద రకరకాల పేర్లతో ఉండే చార్జీలు- వెరసి బిల్లు మీద దాదాపు 30 శాతం ఎక్కువగా చెల్లించేసి బిక్కమొగంతో బయటకి వస్తాం. ఇంతకీ అందులో కొంతమొత్తం మనం అసలు కట్టాల్సిన అవసరమే లేదు తెలుసా!

 

దాదాపు అన్ని రెస్టారెంట్లూ సర్వీస్ చార్జ్ పేరుతో 10 శాతం వరకు అదనంగా వసూలు చేస్తుంటాయి. నిజానికి సర్వీస్ చార్జి వసూలు చేయమని ఏ చట్టంలోనూ లేదు. అలా వసూలు చేసే డబ్బు ఏ ప్రభుత్వానికీ వెళ్లదు. సర్వీస్ చార్జ్ అంటే హోటలు సేవలు నచ్చి మనం ఇచ్చే డబ్బు. అంటే సర్వర్కి టిప్పు ఎలాగో, హోటల్కి సర్వీస్ చార్జ్ అలా అన్నమాట! కాబట్టి ఇంత సర్వీస్ చార్జ్ చెల్లించి తీరాలని ఏ చట్టమూ పేర్కొనలేదు. పైగా అలా సర్వీస్ చార్జ్ని బలవంతంగా వసూలు చేయాలనుకోవడం చట్టవిరుద్ధం కూడా! సర్వీస్ చార్జ్ అని పేర్కొన్న కాలం (column) పక్కన వినియోగదారుడే తనకు తోచిన రుసుము చేర్చాలని ప్రభుత్వం పేర్కొంటోంది.

 

ఇక GST వచ్చిన తర్వాత రెస్టారెంట్లలో బాదుడు పెరిగిపోయిందన్న విషయం తెలిసొందే! చిన్నపాటి ఏసీ రెస్టారెంటులో తిన్నా కనీసం 18 శాతం GST కట్టాల్సి వస్తోంది. దీనికి సర్వీస్ చార్జి మరో పది శాతం తోడైతే చెప్పేదేముంది! పైగా చాలా హోటళ్లు GST లెక్కపెట్టేటప్పుడు సర్వీస్ చార్జిని కూడా కలుపుతున్నాయి. అసలు బిల్లు 100 రూపాయలు, సర్వీస్ చార్జి 10 రూపాయలు అయితే... మొత్తం 110 రూపాయల మీద GST లెక్క కడుతున్నాయన్నమాట!

 

ఈ విషయాలు చాలామందికి తెలియకో... తెలిసినా లేనిపోని గొడవ ఎందుకనో నిశ్శబ్దంగా బిల్లు చెల్లించేస్తుంటారు. హోటళ్లు కూడా అంతే నిశబ్దంగా ఆ డబ్బుని తమ ఖాతాలో జమచేసుకుంటాయి. కడుపు మీద కొట్టడం అంటే ఇదే కదా!

- నిర్జర.