ఆంధ్రా ఊటీలో 'ప్రైవేట్'పాగా
Published on: Sat Mar 24, 2012 10:52AM
విజయవాడ సమీపంలోని భవానీపురం ఐలాండ్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న వివాదాస్పద నిర్ణయం ఇంకా సద్దుమణగకుండానే మరో వివాదం తలెత్తింది. ఆంధ్రా ఊటీగా పేరుపొందిన చిత్తూరుజిల్లాలోని హార్స్ లీ హిల్స్ ను ప్రైవేట్ సంస్థకు అప్పటించేందుకు పర్యాటకశాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. చిత్తూరుజిల్లాలో ప్రముఖ హోటళ్ళను నిర్వహిస్తున్న ఒక సంస్థకు హార్స్ లీ హిల్స్ లో సుమారు నాలుగున్నర ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు ప్రయత్నాలు గుట్టుగా జరుగుతున్నాయి.
నిజానికి రాష్ట్రంలో ఉన్న ఏకైక వేసవి విడిది హార్స్ లీ హిల్స్. ఇప్పటిదాకా ఇది పర్యాటకశాఖ ఆధీనంలోనే ఉంది. అయితే పెద్దగా అభివృద్ధికి నోచుకోనప్పటికీ పర్యావరణం మాత్రం చెక్కుచెదరలేదు. కానీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే ఇక్కడి పర్యావరణం, సహజసిద్ధ ప్రకృతి సౌందర్యం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థలకు ఈ భూమిని అప్పగిస్తే వారు స్టార్ హోటళ్ళు, రిసార్ట్స్ నిర్మించి వ్యాపారం చేసుకుంటారని, అయితే ఇవేమీ స్థానికులకుగాని, సామాన్యులకుగాని అందుబాటులో ఉండవని హార్స్ లీ హిల్స్ వాసులు అంటున్నారు. ఈ భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే అడ్డుకుంటామని కూడా వారు హెచ్చరిస్తున్నారు.


