చెవి నొప్పికి ఇంటి వైధ్యం

 

మన పిల్లల్ని బాధించే వాటిలో చెవి నొప్పి ఒక పెద్ద సమస్య. పెద్దవాళ్ళకి చెవి పోటు వస్తే చక్కగా వాళ్ళకి తెలిసిపోతుంది.  అదే పిల్లల్లో వస్తే వాళ్లకి చెప్పటం రాకపోవటం వల్ల ఏదో ఒక రకమైన పేచీ పెట్టి ఏడుస్తూ కూర్చుంటారు. అస్తమాట్లు చెవిని నలుపుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి మనకి బాధ. డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్ళే లోపు కాస్త నొప్పి సర్దుకోవటానికి కొన్ని ఇంటి వైద్యాలు చేస్తే మంచి ఫలితం ఉండచ్చేమో.

 

సాదారణంగా పిల్లలు ఇయర్ బడ్స్ తో ఆడుకుంటూ చెవిలో పెట్టి తిప్పుకుంటూ ఉంటారు. పొరపాటున దానికి ఉన్న దూది చెవిలో ఉండిపోయినా పెద్దగా పట్టించుకోకుండా ఆడేసుకుంటారు. దాని ఫలితంగా కొన్నాళ్ళు పోయేసరికి చెవిపోటు రావటం, దాని వల్ల జ్వరం రావటం ఇలాంటివన్నీ మొదలవుతాయి. అందుకే వీలయినంత వరకు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అసలు ఇయర్ బడ్స్ వారికి అందుబాటులో ఉంచకుండా జాగ్రత్త పడటం మంచిది.

ఇక అనేక కారణాల వల్ల వచ్చే చెవిపోటు కోసం ఏం చెయ్యాలో చూద్దాం.

 

 

హైడ్రోజెన్ పెరోక్సైడ్ ఇలాంటి సమస్యలకి ఒక మంచి విరుగుడు. పిల్లల చెవిలో ఏదైనా చెత్త ఉండిపోయినా లేదా చీమలు, చిన్న పురుగులు లాంటివి ఉండిపోయినా పిలల్ని పడుకోబెట్టి చెవిలో ఐదు చుక్కల హైడ్రోజెన్ పెరోక్సైడ్ వేసి కాసేపు అలానే ఉంచాలి. దానితో చెవిలో ఏదైనా ఉంటే నురుగుతో పాటు బైటకి వచ్చేస్తుంది.

 

చెవిపోటు వల్ల ఇబ్బంది పడుతున్నప్పుడు గళ్ళ ఉప్పుని కాస్త కడాయిలో వేడి చేసి దానిని పల్చటి బట్టలో కట్టి ఓర్చుకునే వేడి ఉన్నప్పుడు చెవి చుట్టూ కాపడం పెడితే నొప్పి తగ్గి పిల్లలు హాయిగా నిద్ర పోతారు. వాళ్ళు నిద్రపోయేటప్పుడు తల కింద పిల్లో పెట్టకుండా పడుకోబెడితే మంచి ఫలితం కనిపిస్తుంది.

 

తులసి రసం కూడా చెవి నొప్పికి బాగా పనిచేస్తుంది. ఒక పది తులసి ఆకుల్ని చేతితో నలిపి రసం పిండి దానిని రెండు చుక్కల చొప్పున రోజులో కనీసం నాలుగు ఐదు సార్లు వేస్తూ ఉండాలి. దొరికితే నల్ల తులసి ఇంకా మంచిది.


చెవి పోటుతో ఇబ్బంది పడే పిల్లల కోసం తీసుకోవల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది వాళ్ళు స్నానం చేసేటప్పుడు నీరు లోపలకి వెళ్ళకుండా చూసుకోవటం. స్నానానికి ముందు వేసలైన్ పోసిన దూదిని చెవిలో పెట్టి స్నానం చేయిస్తే అది నీటిని లోపాలకి రానీయకుండా ఉంటుంది. చెవి లోపల ఉండే ఇన్ఫెక్షన్స్ పెరగకుండా ఉంటుంది.


ఆలివ్ ఆయిల్ కాస్త వేడి చేసి చెవిలో పోసి ఉంచడం వల్ల లోపల ఏదైనా గడ్డకట్టి ఉండిపోయినా కరిగిపోయి త్వరగా బయటకి వస్తాయి. అలాగే వేడి నీళ్ళు ఒక హాట్ బాగ్ లో పోసి దానిని చెవి చుట్టూ పెడుతూ ఉంటే నొప్పి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.

 

కొంతమంది పిల్లలు సెల్ ఫోన్ లో పాటలు పెద్ద సౌండ్ పెట్టుకుని చెవికి ఆనించుకుని వింటూ ఉంటారు. ఇలా చేస్తున్న వాళ్ళని కాస్త మెల్లిగా నచ్చచెప్పి అలా చేయకుండా చూసుకోవాలి. అలాగే పెన్సిళ్ళు, పెన్నులు చెవిలో పెట్టి తిప్పుకునే అలవాటుని కూడా తగ్గించాలి. మొత్తానికి చెవి నొప్పికి కారణాలు అనేకం ఉన్నా ఆ సమస్యని సరైన ఇయర్ స్పెషలిస్ట్ దగ్గరకి తీసుకువెళ్ళే లోపు పైన చెప్పినలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయటం మంచిదే కదా.


...కళ్యాణి