బాధితురాలితో మాట్లాడిన హోంమంత్రి..బాధ్యులపై కఠిన చర్యలు
posted on Jun 17, 2025 3:33PM
.webp)
చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం లో అప్పు తీర్చలేదు అని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై బాధితులతో హోంమంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ లో మాట్లాడారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బాధితురాలి ద్వారా అడిగి తెలుసుకున్నానని తెలిపారు. జరిగిన అన్యాయానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, బాధితురాలికి హామీ ఇచ్చారు.
బాధితురాలితో తాను మాట్లాడిన వీడియోను కూడా హోం మంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు . ఈ ఘటనపై తక్షణమే చర్యలు చేపట్టాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలుతో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే తనకు సమర్పించాలని ఎస్పీని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, వారి ఆత్మగౌరవానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు.