హోళీ ఆడే తీరు...ఒక్కో చోట ఒక్కోలా!

హోళీ అంటే ప్రపంచానికి రంగుల పండుగే కావచ్చు. కానీ భారతీయుల దృష్టిలో అంతకంటే ఎక్కువే! ఆధ్మాత్మికంగానూ, భౌతికంగానూ భారతీయుల జీవనవిధానానికి హోళీ ఓ రంగుల ప్రతీక. అందుకనే వారు హోళీని ఇలా మాత్రమే జరుపుకోవాలి అని నిశ్చయించుకోలేదు. ఒకో ప్రాంతంవారు రంగులతో ఆడుకునేందుకు ఒకో తీరున హోళీ ఆచారాన్ని సాగిస్తుంటారు. కావాలంటే చూడండి...

లాఠ్మార్ హోళీ

ఉత్తర్ప్రదేశ్లో జరిగే హోళీ మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుని జీవితంతో ముడిపడిన మధుర, బృందావన్ వంటి ప్రాంతాలన్నింటినీ కలిపి వ్రజభూమిగా పిలుస్తారు. ఈ వ్రజభూమిలో హోళీ లాఠ్మార్ పేరుతో జరుగుతుంది. అలనాడు శ్రీకృష్ణుడు, రాధాదేవితో కలిసి హోళీ ఆడేందుకు ఆమె పుట్టిళ్లయిన బర్సానాకు చేరుకున్నాడట.

తనని ఆటపట్టిస్తున్న కృష్ణుని ఎదుర్కొనేందుకు రాధాదేవి లాఠీతో కృష్ణుని వెంటపడిందట. ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ ఈ వ్రజభూమిలో మగవారేమో ఆడవారి మీద రంగులు చల్లే ప్రయత్నం చేయడం, ఆడవారేమో ఆ ఆకతాయితనాన్ని ఎదుర్కొనేందుకు లాఠీలు ఝుళిపించడం చేస్తుంటారు.

షిమోగా

గోవాలో సంప్రదాయంగా జరుపుకొనే వసంత ఉత్సవం ‘షిమోగా’. హోళీ పౌర్ణమికి ఐదు రోజుల ముందునుంచే మొదలయ్యే ఈ పండుగకు హోళీ ఓ ముగింపునిస్తుంది. ఇందులో భాగంగా ఊరూరా తమ చరిత్రను గుర్తుచేసుకునేలా సంప్రదాయ నృత్యాలు సాగుతాయి. డప్పు వాయించేవాళ్లు ఇంటింటికీ తిరుగుతూ భిక్షమెత్తుకుంటారు. గ్రామదేవతలకు బలులు సాగుతాయి. గుళ్లలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. హోళీనాటికి షిమోగా పండుగ పతాకస్థాయిని చేరుకుంటుంది. స్థానికులతో కలిసి ఈ పండుగను చేసుకునేందుకు వేలమంది విదేశీయులు వస్తారు. ఈ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కూడా పెరేడ్లు నిర్వహిస్తుంటుంది.

కుమౌనీ హోళీ

ఎక్కడన్నా పండుగ ఒకరోజు జరుగుతుంది, రెండు రోజులు జరుగుతుంది... ఇంకా మాట్లాడితే పదిరోజులు జరుగుతుంది. కానీ కుమౌనీ హోళీని దాదాపు 40 రోజుల పాటు జరుపుకుంటారు. వసంత పంచమి రోజున మొదలవుతుంది వీరి హోళీ పండుగ. అందులో బోలెడు రకాలు, ఆచారాలు ఇమిడి ఉంటాయి. ఉదాహరణకు ‘బైఠకీ హోళీ’లో సంగీతకారులు ఒకచోటకు చేరి కొన్ని ప్రత్యేక రాగాలను ఆలపిస్తారు. వీటిని వినేందుకు జనం గ్రామగ్రామంలోనూ ఒకచోటకి చేరతారు. ఇలా సంగీతాన్ని కూర్చుని వినే అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీనికి బైఠకీ హోళీ అని పేరు వచ్చింది. ఇక ఈ హోళీ సమయంలో సంప్రదాయ ఖాదీ వస్త్రాలను ధరిస్తారు కాబట్టి ‘ఖాదీ హోళీ’ అని పిలుచుకుంటారు. ఈ సమయంలోనే మహిళలు ప్రత్యేకించి ఒక చోట చేరి గీతాలను ఆలపిస్తారు. ఆ సందర్భాన్ని ‘మహిళా హోళీ’ అంటారు.

ఫాల్గుణ పౌర్ణమి నాటి హోళీ ఘట్టానికి రంగులు చల్లుకునేందుకు ఈ నలభై రోజుల నుంచీ కూడా చెట్టూపుట్టా తిరుగుతారు. అక్కడ వేర్వేరు రంగు పూలను సేకరించి, పొడిచేసి సిద్ధంగా ఉంచుకుంటారు. హోళీ ముందు రోజు... హోళిక అనే రాక్షసి మంటల నుంచి ప్రహ్లాదుడు తప్పించుకోవడాన్ని గుర్తుచేసుకుంటూనే మంటలు వేసుకుంటారు. హోళీకి ముందే ఇంత హడావుడి ఉంటుందంటే, ఇక హోళీనాడు ఎంత సంబరం సాగుతుందో చెప్పేదేముంది!

హోళా మొహల్లా

పంజాబులో హోళీ మరునాడు జరుపుకొనే ఈ పండుగలో సిక్కులు తమ యుద్ధవిద్యలను ప్రదర్శిస్తారు. సిక్కులలోని యుద్ధనైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సాక్షాత్తూ వారి గురువైన గోవింద్ సింగ్ ఏర్పరిచిన సంప్రదాయం ఇది. హోళీ మర్నాడే ఈ ఆచారాన్ని మొదలుపెట్టడం వెనుక ఆయన ఉద్దేశం ఏమైనప్పటికీ... పంజాబువాసులు అటు హోళీనీ, ఇటు హోళా మొహల్లాను కూడా ఘనంగా జరుపుకుంటారు.

ఇంతేనా! గుజరాత్లో హోళీ సందర్భంగా ఉట్టి కొడతారు, ఒడిషాలో రాధాకృష్ణులను ఊరేగించి వారికి రంగులను అర్పిస్తారు, పశ్చిమబెంగాల్లో దీనిని డోలీ పూర్ణిమ పేరుతో ఓ సంగీతోత్సవంగా నిర్వహిస్తారు. ఇలా చెప్పుకొంటూ పోతే ప్రతి రాష్ట్రంలోనూ హోళీకి ఒకో ప్రత్యేకత కనిపిస్తుంది. రంగుల ప్రపంచం అన్నా, ఆ ప్రపంచంలో లయబద్ధంగా జీవించడం అన్నా భారతీయులకు ఎంత ఇష్టమో హోళీ తెలియచేస్తుంటుంది.

- నిర్జర.