హెచ్‌.ఐ.వి టీకా వచ్చేస్తోంది

 

ఎయిడ్స్‌! ఈ పేరు వింటే చాలు ప్రపంచం ఇప్పటికీ వణికిపోతోంది. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేసినా, పరిశోధకులుఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... హెచ్‌.ఐ.వి అనే మహమ్మారి ఏటా లక్షలమందిని కబళిస్తూనే ఉంది. భారతీయ శాస్త్రవేత్తలతో సహా ఎంతోమంది ఈ వ్యాధికి మందులనో, టీకాలనో కనుగొన్నామని ప్రకటిస్తూనే వస్తున్నారు. అయితే అవి ఇంకా తుదిదశకు చేరుకోలేదు. ఇప్పుడు హెచ్.ఐ.విని ఎదుర్కొనే ఒక టీకాను దక్షిణాఫ్రికాలో ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారు.

 

దక్షిణాఫ్రికాలోనే ఎందుకు!

ఈ టీకాను అమెరికన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినప్పటికీ, దానిని దక్షిణాఫ్రికాలో ప్రయోగించడానికి ఒక కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఎయిడ్స్‌ ప్రబలుతున్న దేశాలలలో దక్షిణాఫ్రికా ఒకటి. అక్కడ దాదాపు 19 శాతం మంది ప్రజలు హెచ్‌.ఐ.వి వైరస్‌ను కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెచ్‌.ఐ.వీ బాధితులలో ఐదో వంతు మంది ఆ దేశంలోనే ఉన్నారు. పైగా హెచ్‌.ఐ.వి వైరస్‌లో '‘subtype C” అనే మొండిరకం అక్కడి ప్రజలలోనే ఎక్కువగా కనిపిస్తోంది.

 

ఇంతకుముందు ధాయ్‌లాండ్‌లో

హెచ్‌.ఐ.వి టీకాను ప్రజల మీద ప్రయోగించడం ఇదేమీ కొత్త కాదు. ఒక ఆరేళ్ల క్రితం (2009) థాయ్‌లాండ్‌లో కొందరి మీద ఈ టీకాను ప్రయోగించారు. అక్కడ కొంతమేరకు టీకా విజయాన్ని సాధించింది కూడా! హెచ్‌.ఐ.వి టీకాను తీసుకున్నవారిని తిరిగి మూడున్నర ఏళ్ల తరువాత గమనిస్తే... వారిలో దాదాపు మూడోవంతు మంది హెచ్‌.ఐ.వి వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు తేలింది.

 

మరింత శక్తిమంతం

ఈసారి దక్షిణాఫ్రికాలో ప్రయోగించనున్న టీకా మునుపటికంటే మరింత శక్తిమంతమైందని చెబుతున్నారు. వైరస్‌ను మరింత ప్రభావవంతంగా ఎదుర్కొనేందుకు, రోగనిరోధక శక్తిని మరింతగా పెంచేందుకు అనువుగా ఈ టీకాను రూపొందించారట. దీనిని 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న 5,400 మందికి అందించే ప్రయత్నం చేస్తున్నారు. వాక్సినేషన్‌లో భాగంగా అభ్యర్థులకు ఏడాదికాలంలో రెండు సార్లు టీకాను అందిస్తారు. టీకాను అందించి మూడేళ్లు ముగిసిన తరువాత వారిలో ఎంతమంది హెచ్‌.ఐ.విని సమర్థంగా ఎదుర్కొన్నారో పరీక్షిస్తారు. పరిశోధకుల అంచనా మేరకు కనీసం 50 శాతం మందైనా ఈ టీకాతో హెచ్‌.ఐ.విని ఎదుర్కొనే అవకాశం ఉంది.

 

ఇప్పటివరకూ హెచ్‌.ఐ.విని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. కేవలం ‘యాంటి రిట్రోవైరల్‌’ అనే చికిత్స ద్వారా హెచ్‌.ఐ.వి వైరస్ తీవ్రతను కాస్త తగ్గించే ప్రయత్నమే జరుగుతోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో జరుగుతున్న పరీక్షలు కనుక సత్ఫలితాలను ఇస్తే మున్ముందు హెచ్.ఐ.విని ఎంతోకొంత మేర ఎదుర్కోవచ్చుననే ఆశ కలుగుతోంది. ఆ ఆశ ఎంతమేరకు ఫలిస్తుందో తెలుసుకోవాలంటే మరో మూడేళ్లు ఆగాల్సిందే!

 

- నిర్జర.