Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హిల్లరీ క్లింటన్ అనారోగ్యంగా ఉన్నారా?
posted on: Aug 17, 2016 12:19PM
.jpg)
ఈసారి జరుగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు బహుశా ఎప్పుడూ లేనంతగా ప్రచారం జరుగుతోంది. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ హోరాహోరీగా పోరాడుతున్నారు. ట్రంప్ తన దూకుడు మాటలతో ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షిస్తే... అమెరికా చరిత్రలోనే తొలి మహిళా అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ ఇప్పటికే చరిత్ర సృష్టించారు. ఈ హోరాహోరీ ఎన్నికలలో పై చేయిని సాధించేందుకు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అభ్యర్థులు. వాటిలో ఈ మధ్యకాలం వార్తల్లోకి వస్తున్న అంశం... హిల్లరీ క్లింటన్ ఆరోగ్యం!
ఇదీ ఆరోపణ
అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న హిల్లరీ క్లింటన్ అప్పుడప్పుడూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారన్నది ఆరోపణ. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా స్తబ్దుగా నిలబడిపోవడం, మాట ఒకోసారి తీవ్రంగా తడబడటం, బెదురు చూపులు చూడ్డం వంటి పనులు చేస్తున్నారట. ఒక సందర్భంగా అయితే ఫిట్స్ వచ్చిన మనిషిలాగా తలని ఊపడంతో చుట్టుపక్కలవారందరూ కంగారుపడ్డారు.
హిల్లరీ ఇలా చిత్రంగా ప్రవర్తించిన వీడియోలు ఇంటర్నెట్‌లో చాలానే కనిపిస్తున్నాయి. ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నారన్నది ఆరోపణ. హిల్లరీ ఉపన్యాసం ఇచ్చిన ప్రతిసారి వెళ్లి విశ్రాంతి తీసుకోక తప్పదంటూ ట్రంప్ వ్యాఖ్యనించారు కూడా!
ఇదీ నేపథ్యం
2012లో ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసే సమయంలో ఒకసారి హిల్లరీకి జ్వరం సోకింది. జ్వరం తీవ్రస్థాయికి చేరుకోవడంతో ఆమె ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. ఆ స్థితి నుంచి పూర్తిగా కోలుకోవడానికి హిల్లరీకి ఆరు నెలల సమయం పట్టిందంటూ సాక్షాత్తూ ఆమె భర్త బిల్ క్లింటన్ పేర్కొన్నారు. ఎవరన్నా ఇలా ఎక్కువసేపు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతే వాళ్ల మెదడు దెబ్బతినే అవకాశం ఉంది కదా! అన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అనుమానం.
ఇదీ జవాబు!
హిల్లరీ క్లింటన్ ఏమీ చిన్నపిల్ల కాదు. 69 ఏళ్ల మనిషి. ఆ మాటకు వస్తే హిల్లరీ ప్రత్యర్థి ట్రంప్‌కు 70 ఏళ్లు! ఈ వయసులో చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అంతమాత్రం చేత ఏవేవో ఊహించేసుకుని ఆమెను అభాసుపాలు చేయడం మంచిది కాదంటున్నారు హిల్లరీ అభిమానులు. హిల్లరీ పరిపూర్ణ ఆరోగ్యంతో ఉందని, గత అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా కోలుకుందనీ.. ఆమె వ్యక్తిగత వైద్యురాలైన లీసా బార్డాక్ హామీ ఇస్తున్నారు. అది నిజమేననీ, హిల్లరీ సంపూర్ణ ఆరోగ్యంతో అమెరికా అధ్యక్షపదవిని చేపట్టి చరిత్రను సృష్టించాలన్నది ఆమె అభిమానుల ఆకాంక్ష!
- నిర్జర.






