తెలంగాణపై వరుణుడి కరుణ వరద
Published on: Sat Jul 23, 2022 11:12AM
ఊహించనివిధంగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షాలతో తెలంగాణాపై వరుణుడి కరుణ వరద కొనసాగుతోంది. దీంతో వరుణుడి వలలో రాష్ట్రం చిక్కుకున్నట్టుగా ఉన్నది. ఈ వర్షాల కారణంగా ఉద్యోగులు, పనులకు వెళ్లేవారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక వంక జలాశయాలు నిండుతున్నాయన్న ఆనందంగా ఉన్నప్పటికీ మరీ కదలనీయని స్థితిలో వర్షాలు ముంచెత్తడం భయాందోళనకూ గురిచేస్తోంది.
వర్షాల కారణంగా భాగ్యనగరంలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఉస్మాన్‌సాగర్ ఇన్ ఫ్లో 2000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ఉస్మాన్‌సాగర్ నాలుగు గేట్లను ఎత్తి 832 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1786.65 అడుగులకు చేరింది. అటు హిమాయత్‌సాగర్‌కు 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు హిమాయత్ సాగర్ రెండు గేట్లను ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులకు గాను, ప్రస్తుత నీటి మట్టం 1760.50 అడుగులకు చేరింది.
మెదక్, సంగారెడ్డి జిల్లాలో అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో మెదక్ మండలంలో 26.8 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. శివ్వంపేట మండలంలో 21.4 సెంటిమీటర్లు, తుప్రాన్ మండలంలో 19.6 సెంటీమీటర్లు, చిన్న శంక రం పేటలో 19.4 సెంటీమీటర్లు, వెల్దుర్తి లో 17.3 సెంటీ మీటర్లు, నర్సాపూర్‌లో 17.2 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
అటు సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీమీటర్లు, ఆందోల్‌లో 15.4 సెంటీమీటర్లు మేర వర్షపాతం నమోదు అయ్యింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాల కారనంగా మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు ఆరు గేట్లు ఒక అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 7,612.52 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 3,600 .18 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.33 టీఎంసీలకు చేరింది.


