ఆడవారి గుండెజబ్బును పట్టించుకోని వైద్యులు

 

స్త్రీల పట్ల మన వ్యవస్థలో అడుగడుగా పక్షపాత ధోరణి ఉంటుందన్నది చాలామంది ఆరోపణ. ఏదో కావాలని ఇలాంటి పక్షపాతాన్ని జనం ప్రదర్శిస్తారనుకోనవసరం లేదు. మనకి తెలియకుండానే నరనరాల్లో ఆడవారంటే కాస్త చులకన భావం ఉంటుంది. అది వైద్యరంగంలో కూడా ఉంటుందనీ... ఆడవారికి ప్రాణాంతకంగా మారుతోందనీ ఓ పరిశోధన రుజువుచేస్తోంది.

మన దేశంలో అత్యధిక మరణాలు గుండెజబ్బుల వల్లే ఏర్పడుతున్నాయి. ఆ మాటకు వస్తే ఆస్ట్రేలియాలో కూడా ఇదే పరిస్థితి. అందుకనే ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ సర్వేను చేపట్టారు. అసలు ఆడవారిలో గుండెపోటుని నివారించే దిశగా అక్కడి వైద్యులు ఏమన్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్నదే వారి సర్వే ఉద్దేశం. ఇందులో దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.

సాధారణంగా ఓ 35- 40 ఏళ్లు దాటిన తరువాత మనం వైద్యుడి దగ్గరకి ఏదో సమస్యతో వెళ్లామనుకోండి... మన సమస్యతో పాటుగా సిగిరెట్, మందు వగైరా అలవాట్లు ఉన్నాయేమో కనుక్కోటారు. పనిలో పనిగా మన రక్తపోటుని కూడా పరిశీలిస్తారు. ఎందుకైనా మంచిది ఓసారి షుగర్ లెవెల్స్ కూడా సరిచూసుకోమని చెబుతారు. ఇంకా మాట్లాడితే ‘40 ఏళ్లు దగ్గరకి వచ్చాయి కాబట్టి ఓసారి కంప్లీట్ చెకప్ చేయించుకోండి మాస్టారూ!’ అని సలహా ఇస్తారు. కానీ ఆడవారికి మాత్రం వారి సమస్యకి ఓ నాలుగు మందులు రాసి పంపించేస్తారట.

ఆడవారిలో గుండెజబ్బుకి దారితీసే పరిస్థితులను ముందస్తుగా నమోదు చేసే ప్రయత్నం 40 శాతం సందర్భాలలోనే జరుగుతోందని తేలింది. ఒకవేళ నమోదు చేసినా కూడా అందులో దాదాపు సగం మందికి మాత్రమే గుండెజబ్బుని నివారించే మందులను అందించడం జరుగుతోంది. మగవారితో పోలిస్తే గండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని గుర్తించి తగిన మందులను అందించడం అనేది 37% తక్కువగా ఉన్నట్లు బయటపడింది.

గుండెజబ్బు కేవలం మగవారికి సంబంధించిన సమస్య కాదు! నిజానికి ఆస్ట్రేలియాలో మగవారికంటే ఆడవారే గుండెకు సంబంధించిన వ్యాధులతో చనిపోతున్నట్లు తేలింది. పైగా ఆడవారిలో వచ్చే గుండెజబ్బులు మరింత సమస్యాత్మకం. ఎందుకంటే గుండెపోటుకి సంబంధించి వారిలో కనిపించే లక్షణాలు వేరు. గుండెపోటు వచ్చిన తరువాత వారు కోలుకునే అవకాశాలూ తక్కువే! పైగా మగవారు పొగ తాగడం కంటే ఆడవారు పొగ తాగడం వల్ల... వారి గుండెకు ఎక్కువ నష్టం ఉంటుందట. ఇలా చెప్పుకుంటూ పోతే ఆడవారి గుండెను మరింత పదలంగా కాపాడుకోవాల్సిన సందర్భాలు చాలానే స్ఫురిస్తాయి.

అభివృద్ధి చెందిన దేశమైన ఆస్ట్రేలియాలోనే పరిస్థితి ఇలా ఉందంటే... వైద్యుడిని కలవడానికి కూడా భర్త అనుమతి తీసుకోవాల్సిన మన దేశంలో ఇంకెంత దారుణమైన స్థితి ఉందో ఊహించుకోవచ్చు. మన దగ్గర డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యలు ఎక్కువ. పైగా ఏదన్నా నొప్పి చేస్తే అదేదో పని ఒత్తిడి వల్ల వచ్చిందనుకుని సర్దుకుపోయే తత్వం కనిపిస్తుంది. వీటన్నింటి ఫలితం.... ఆడవారి గుండె పగిలిపోతోంది!!!

- నిర్జర.