ఇవి పాటిస్తే నిద్ర ఖాయం


సుఖంగా నిద్రపోవాలని ఎవరికి మాత్రం అనిపించదు. జీవితంలో ఏం సాధించినా, ఎంత సంపాదించినా... కంటికి నిండుగా నిద్రలేకపోతే అది లోటుగానే మిగిలిపోతుంది. నిద్ర పొందేందుకు ఎవర్ని కదిపినా రకరకాల చిట్కాలు చెబుతుంటారు. అంకెలు లెక్కపెట్టడం దగ్గర్నుంచీ ధ్యానం చేయడం వరకూ ఒకో మనిషిదీ ఒకో చిట్కా. మరి నిద్ర కోసం నిపుణులు చెప్పే మాటలు ఏమిటో చూడండి...

 

01. నిద్ర కోసం ఒకటే సమయం: నిద్ర పోయేందుకు, ఉదయాన్నే లేచి పనుల్లోకి ఉపక్రమించేందుకు ఒక నిర్ణీత షెడ్యూల్‌ ఉండాలంటారు. అప్పుడు మన శరీరంలోని జీవగడియారాన్న అదుపులో ఉంచుకున్నట్లవుతుంది. వీకెండ్స్‌ పేరిటో, టీవీలో మంచి సినిమా వస్తోందనో, పార్టీకు వెళ్లేందుకో... ఇలా తరచూ ఏదో ఒక సాకుతో ఈ వేళలలో మార్పులు చేయవద్దంటున్నారు.

 

02. వ్యాయామం: శరీరానికి వ్యాయామం ఉంటే అలసట ఖాయం. అలసటగా ఉన్నప్పుడు నిద్ర కూడా ఖాయమే! అందుకే రోజూ శరీరం అలసిపోయేలా కాస్త వ్యాయామం చేయమంటున్నారు. కాకపోతే ఈ వ్యాయామాన్ని నిద్రపోవడానికి ఓ నాలుగు గంటల ముందుగానే ముగించాలి.

 

03. నికోటిన్- కెఫిన్‌: కాఫీ, చాక్లెట్, కూల్‌డ్రింక్స్‌ వంటి పదార్థాలలో ఉండే కెఫిన్‌ నిద్రను అడ్డుకొంటుంది. అందుకనే నిద్రలేమితో బాధపడేవారు మధ్యాహ్నం నుంచే వీటికి దూరంగా ఉండమని సూచిస్తున్నారు. ఇక సిగిరెట్టులో ఉండే నికోటిన్‌ కూడా నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. 

 

04. భారీ భోజనం: ఈ రోజుల్లో ఉదయం ఫలహారం, మధ్యాహ్నం భోజనం సవ్యంగా సుష్టుగా చేసే సమయం మనకి దొరకడం లేదు. అందుకని రోజంతా కొరత పడిన ఆహారాన్ని, ఉదయం నుంచి దాచుకున్న జిహ్వ చాపల్యాన్ని రాత్రివేళ పూడ్చుకుంటాం. ఇలా పొట్ట నిండుగా ఉండటం వల్ల మత్తుగా అయితే ఉంటుంది కానీ నిద్ర మాత్రం పట్టదు. పైగా మాంసాహారం, మసాలాలు దట్టించిన ఆహారంతో ఇక నిద్ర సంగతి మర్చిపోవచ్చు.

 

05. మద్యపానం: చాలామంది మద్యపానం వల్ల నిద్రపడుతుందని అనుకుంటారు. నిజానికి మద్యం మత్తు దిగగానే నిద్ర కూడా వదిలిపోతుంది. పైగా అదే అలవాటైతే రోజూ మద్యపానం లేనిదే నిద్ర దరిచేరని పరిస్థితి వస్తుంది.

 

06. గోరువెచ్చని స్నానం: గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల బడలిక తీరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పైగా శరీరంలోని ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి వెనువెంటే తగ్గడంతో ఒళ్లు చల్లబడిన భావన కలుగుతుంది. దీంతో మంచి నిద్ర పడుతుంది.

 

07. బలవంతం వద్దు: నిద్ర పట్టకపోయినా మంచం మీదే కూర్చుని పైకప్పు వంక చూడటం వల్ల చిరాకు పుడుతుందే కానీ నిద్ర మాత్రం రాదు. అందుకనే నిద్ర పట్టనప్పుడు లేచి అలా కాస్త తిరిగి రావడమో, ఏదన్నా పుస్తకం చదువుకోవడమో, ఏదన్నా సర్దుకోవడమో చేసి మగత కలిగినప్పుడే మంచం మీదకు చేరుకోవాలి.

 

08. తగిన వాతావరణం: నిద్రపోయేందుకు ఓ గంట ముందుగానే నిద్రకు సంబంధించిన వాతావరణం ఉండేట్లు చూసుకోవాలి. తక్కువ వెలుతురు ఉండే లైట్లు వేసుకోవడం, బెడ్‌రూం మరీ వేడిగా కానీ చల్లగా కానీ లేకుండా చూసుకోవడం వంటి వాతావరణంతో శరీరం నిద్రకు సిద్ధమవుతుంది.

 

09. మనసు ప్రశాంతం: రోజంతా ఎలాగూ ఏవో ఒక సమస్యలు తప్పవు. కానీ రాత్రివేళ కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకున్నా కూడా అవే సమస్యలు మెదడులో గిర్రున తిరుగుతూ ఉంటాయి. అవే నిద్రలేమికి కారణం అవుతాయి. ‘ఏదైతే అది జరుగుతుంది, రేపు ఉదయాన్నే చూసుకోవచ్చు,’ అన్న భరోసా ఒక్కటే మనసుని ప్రశాంతంగా ఉంచగలదు. కాసేపు ధ్యానం చేయడం, గాఢంగా శ్వాస పీల్చుకోవడం వంటి చర్యలతో మనసుని చికాకుల నుంచి విముక్తం చేయవచ్చు.

 

10. టీవీ-సెల్‌ఫోన్‌: చాలామందికి రాత్రి పొద్దుపోయే దాకా టీవీ చూసే అలవాటు ఉంటుంది. దీని వలన తెలియకుండానే నిద్రపోవాల్సిన సమయం దాటిపోతుంది. ఇక సెల్‌ఫోన్‌ వంటి పరికరాల వల్ల కూడా సమయం వృధా, బుర్ర ఖరాబు కావడమే కాకుండా... వాటి నుంచి వచ్చే వెలుతురు వల్ల నిద్ర తేలిపోతుందన్నది నిపుణుల అభిప్రాయం.

 

ఇవే కాదు! కొందరికి పాలు తాగితే నిద్ర పట్టవచ్చు, మరికొందరు మధ్యాహ్నం నిద్రను మానివేస్తే రాత్రివేళ సుఖంగా నిద్రపోవచ్చు. ఏం చేసినా తరచూ నిద్రపట్టకపోవడం, ఒకవేళ పట్టినా కూడా గాఢ నిద్ర లేకపోవడం వంటి కారణాలతో రోజూ బడలికగా నిద్ర లేవాల్సి వస్తుంటే మాత్రం ఒకసారి వైద్యుని సంప్రదించడం మంచిది.

 

- నిర్జర.