ఉపాధ్యాయుల ఆరోగ్యం... అంతంతమాత్రమే!

 

తనకు తెలిసిన జ్ఞానాన్ని పదిమందితోనూ పంచుకోవాలనుకునేవాడు గురువు. ఆ తపనలోనే తన జీవితాన్ని కరిగించి వేస్తుంటాడు. మన కోసం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శ్రమిస్తుంటాడు. తరగతిగదిలో ఉపాధ్యాయుడి తీరుని కనుక గమనిస్తే, రకరకాల రోగాలు ఆయనను చుట్టుముట్టేందుకు ఎలా సిద్ధంగా ఉన్నాయో అవగతం అవుతుంది.

 

నిలబడే ఉండటం వల్ల:

ఒక్క అరగంటపాటు నిల్చొని ఉండమంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. అలాంటిది దాదాపు ఆరేడు గంటల పాటు నిర్విరామంగా నిలబడి ఉండటం అంటే మాటలా! నిరంతరం ఇలా నిలబడి ఉంటడంతో మోకాలి నొప్పులు, వెరికోస్‌ వెయిన్స్‌ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అరగంటికి ఒకసారన్నా కాస్త అటూఇటూ తిరగడం, కాలికి సంబంధించిన వ్యాయామాలు చేయడం, వదులైన దుస్తులు వేసుకోవడం, శరీర బరువుని తగ్గించుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ సమస్యల నుంచి దూరం కావచ్చు. 

 

అందరిలో తిరగడం వల్ల:

బడి/ కళాశాలలో అన్ని రకాల మనుషులూ, అన్ని రకాల క్రిములనూ మోసుకువస్తుంటారు. దీనివల్ల సాధారణ జలుబు మొదలుకొని, హెపిటైటిస్‌ వంటి వ్యాధుల వరకూ ఉపాధ్యాయులకు సోకే అవకాశాలు ఎక్కువ. అందుకని తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏ రోజు దుస్తులు ఆ రోజు వేసుకోవడం వంటి వ్యక్తిగత శుభ్రతకి ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. వ్యాయామం చేయడం, పౌష్టికమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధకశక్తి అదుపులో ఉంటుంది.

 

దుమ్మూ ధూళి వల్ల:

పాతకాలం బ్లాక్‌బోర్డులు, చాక్‌పీసుల వల్ల ఊపిరితిత్తులలోకి దుమ్ము చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో శ్వాసకోశ సంబంధ వ్యాధులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇక బడిలోని ఆటస్థలం, తరగతి గదులు, ల్యాబొరేటరీ అపరిశుభ్రంగా ఉన్నా కూడా వాటి ప్రభావం ఉపాధ్యాయుల ఆరోగ్యం మీద పడి తీరుతుంది. కాబట్టి తమ అనారోగ్యానికి కారణంగా ఉన్న పరిస్థితులను ఓసారి పాఠశాల అధికారుల దృష్టికి తీసుకురావడంలో తప్పులేదు.

 

నిరంతరం అరవడం వల్ల:

పాఠం అన్న మాట వినిపించగానే ఖంగుమంటూ వినిపించే స్వరాలే గుర్తుకువస్తాయి. విషయం పిల్లలందరికీ సూటిగా, స్పష్టంగా వినిపించాలనే తపనతో ఉపాధ్యాయులు గొంతు చించుకుని పాఠాలు చెబుతూ ఉంటారు. దీని వల్ల 58% ఉపాధ్యాయులలో స్వరసంబంధమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ఓ పరిశోధనలో తేలింది. గొంతు పొడిబారిపోకుండా తరచూ నీరు తాగుతూ ఉండటం, గొంతులో ఎలాంటి మార్పులు వచ్చినా వైద్యుని సంప్రదించడం, మైక్రోఫోన్‌ వంటి పరికరాలు వాడటం, అవసరం అనుకున్నప్పుడు తప్ప హెచ్చుస్థాయిలో మాట్లాడకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే, గురువుగారి గొంతు ఖంగుమంటూనే ఉంటుందని సూచిస్తున్నారు.

 

ఒత్తిడికి లోనవ్వడం వల్ల:

వందల మంది పిల్లలకి చదువు చెప్పాలి, వారి భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, పాఠాలను సకాలంలో పూర్తిచేయాలి, వారి మార్కులకి బాధ్యత వహించాలి, వారి ప్రవర్తనను కూడా గమనించుకోవాలి.... ఇలా పిల్లలకు సంబంధించిన ఒత్తిడి ఉపాధ్యాయుల మీద చాలా తీవ్రంగానే ఉంటుంది. అందుకనే ప్రతి పది మందిలో ఎనిమిదిమంది ఉపాధ్యాయులు ఒత్తిడికి లోనవుత్తున్నారంటూ పరిశోధనలు పేర్కొంటున్నాయి. ధ్యానంతో మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, చేస్తున్న పనిని ఆస్వాదించడం, విద్యార్థులతో కలివిడిగా ఉండటం, తరగతి గదిలో హాస్యాన్ని పండించడం వంటి మార్పులతో ఈ ఒత్తిడి నుంచి వీలైనంత దూరంగా ఉండవచ్చు. ఇవీ ఉపాధ్యాయుల ఎదుర్కొనే కొన్ని సమస్యలు, వాటికి ఉపాయాలు. ఏవో వారి మీద అభిమానం కొద్దీ మనం ఈ సూచనలు చేస్తున్నాం కానీ వారికి చెప్పేంతటి వారమా! 

 

- నిర్జర.