జాట ఆందోళనల నేపథ్యంలో అత్యాచారాలు!
posted on Feb 25, 2016 10:44AM
.jpg)
హర్యానాని చిగురుటాకులా వణికించిన జాట్ వర్గం ఆందోళనల్లో అవాంఛిత సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయా అంటే ఔననే అంటున్నారు స్థానికులు. హర్యానాలోని ముర్తాల్ అనే జాతీయ రహదారిని నిర్బంధించిన ఉద్యమకారులు, దారిన పోతున్న కార్లని ఆపి అందులోని స్త్రీల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా కనీసం పదిమంది ఆడవారి మీదన్నా అత్యాచారాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ‘ఈ విషయం బయటకి చెబితే మీకే ఇబ్బంది’ అంటూ బాధితురాళ్లని పోలీసులే శాంతింపచేసినట్లు సమాచారం.
దీంతో హైవేకి సమీపంలో ఉన్న కురద్, హసన్‌పూర్ గ్రామస్థులే బాధితులని వారికి తాత్కాలికంగా నీడనిచ్చి పంపివేశారట. హర్యానా రాష్ట్ర డిజీపీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. తాము ఈ వార్తలలో నిజానిజాలు తేల్చేందుకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశామనీ, వార్తల్లో వచ్చినట్లుగా అలాంటి సంఘటనలు ఏవీ జరగలేదంటూ ఆ సంఘం అభిప్రాయపడిందనీ డీజీపీ పేర్కొంటున్నారు. మరోపక్క ఈ వార్త హర్యానా హైకోర్టుని కూడా కలచివేసింది. తక్షణమే ఈ వార్తలకు సంబంధించిన నిజానిజాలను తెలుసుకునేందుకు ఒక దర్యాప్తుని చేపట్టవలసిందిగా న్యాయమూర్తి ఎన్.కె.సంఘి ఆదేశించారు. మరి ఆ నివేదికలో అయినా వాస్తవాలు తేలతాయో లేదో!