హర్యానా పీఠం మీద కాషాయ జెండా రెపరెప

 

ఉత్కంఠ భరితంగా సాగిన హర్యానా ఎన్నికల పోరులో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ విజయం సాధించి అధికార పీఠం మీద కాషాయ జెండా ఎగురవేసింది. 90 స్థానాలున్న హర్యానాలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4 సీట్లకే పరిమితమైన స్థితి నుంచి ఏకంగా 47 సీట్లు గెలుచుకొని సత్తా చాటింది. బీజేపీ గణనీయమైన సీట్లను సాధించడంతోపాటు భారీగా తన ఓట్ల శాతాన్ని పెంచుకోగలిగింది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 9.05 శాతం ఓట్లతో సరిపెట్టుకున్న భారతీయ జనతాపార్టీ తాజా ఎన్నికల్లో 24.15 శాతం ఓట్లను పెంచుకొని మొత్తంమీద 33.2 శాతం ఓట్లు సాధించింది. హర్యానా వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ చేపట్టిన సుడిగాలి ప్రచారం విజయాన్ని సాధించిపెట్టింది. హర్యానా ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టడంతో పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా పాలించిన కాంగ్రెస్, ఈసారైనా అధికారం కోసం కలలుగన్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌ఘోర పరాజయం పాలయ్యాయి.