Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేంద్రం హ్యాండ్సప్! అందరికీ నో టీకా
posted on: Mar 19, 2021 2:45PM
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్రలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైరస్ విజృంభణతో చాలా ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో టీకా కోసం డిమాండ్ పెరుగుతోంది. అయితే కోవిడ్ టీకా పంపిణిపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. టీకా కార్యక్రమంలో వేగం పెరుగుతున్నందున అందరికీ టీకాలు వేస్తారా? అని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి.. ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరోనా టీకాలపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, అవి సురక్షితమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ అందాలంటే కష్టమన్నారు. అందుకే ప్రాధాన్య వర్గాల వారీగా కరోనా టీకాలు వేస్తున్నామన్నారు. శాస్త్రీయ వాస్తవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకునే ప్రాధాన్య వర్గాలను నిర్ణయించామన్నారు. ప్రాధాన్య వర్గాలను గుర్తించేందుకు గత ఏడాది ఆగస్ట్ లోనే ప్రధాని నరేంద్ర మోడీ నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ ను ఏర్పాటు చేశారని, అన్నింటినీ పరిశీలించే ఆరోగ్య సిబ్బంది, ముందు వరుస యోధులు, వృద్ధులు, జబ్బులున్న వారికి టీకాలు వేస్తున్నామని ఆయన వివరించారు. అన్ని పరీక్షలు చేశాకే వ్యాక్సిన్లకు ఆమోదం తెలిపామన్నారు. వ్యాక్సిన్ల గురించి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
‘‘ప్రతి వ్యాక్సిన్ నూ అందరికీ వేయాలనేం లేదు. ప్రస్తుతం వైద్య సిబ్బంది, వృద్ధులు, 45 ఏళ్ల వయసుండి వేరే జబ్బులున్న వారికి కరోనా టీకాలు వేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరింత మందికి వేస్తాం. నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకునే ముందుకు సాగుతున్నాం. భారత నిపుణులే కాదు.. ప్రాధాన్య వర్గాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులనూ సలహాలు, సాయం కోరుతున్నాం’’ అని కేంద్ర మంత్రి వివరించారు.




