హరీష్‌రావు, సీఎం కిరణ్‌ మధ్య మాటల యుద్ధం

 

harish rao kiran kumar reddy, kiran kumar reddy harish rao, congress trs

 

అవిశ్వాసంపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత హరీష్‌రావు మధ్య వాగ్వాదం నెలకొంది. ''నాలుగు జిల్లాలున్న రాయలసీమలో నాలుగు జేఎన్టీయూలు ఉంటే పది జిల్లాలున్న తెలంగాణకు ఎనిమిది జిల్లాలు అక్కర్లేదా ? ” అని హరీష్ రావు డిమాండ్ చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి చిత్తూరుకే తరలిస్తున్నారు అని ఆరోపించారు. కాలర్ పట్టుకుని అడిగాం కాబట్టే నిజామాబాద్ కు కళాశాల ఒకటి ఇచ్చారని హరీష్ రావు అన్నారు.


హరీష్ ప్రసంగం మధ్యలో జోక్యం చేసుకున్న సీఎం మీ దయాదాక్షిణ్యాల వల్ల మేము పదవులు పొందలేమని, కాంగ్రెస్ పార్టీ వల్ల, తమ సభ్యుల వల్లే పదవులు పొందామన్నారు. మా దయాదాక్షిణ్యాలతో మీరు గతంలో మంత్రులయ్యారని సీఎం అన్నారు. తెలంగాణ వ్యక్తిని ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని సీఎం కిరణ్ తెలిపారు.

దీనిపై హరీష్ మాట్లాడుతూ ప్రధానిగా చేసిన పీవీ సమాధికి గజం స్థలం కూడా ఇవ్వలేదని, ప్రధానిగా చేసిన వారందరికీ ఢిల్లీలో ఘాట్ ఇచ్చారని, పీవీని మాత్రం పట్టించుకోలేదు..ఇదేనా మీరిచ్చే గౌరవమని సీఎంను హరీష్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు జీవం పోసింది టీఆర్ఎస్ అని ఆయన అన్నారు. టీడీపీ చేతిలో రెండు సార్లు ఓడిన సమయంలో తెలంగాణ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ గెలిచిందని హరీష్‌రావు పేర్కొన్నారు. దేశానికి ప్రధానికి గా చేసిన పీవీని సభలో అవమానించారని, తెలంగాణ గురించి మాట్లాడే హక్కు మీకు లేదని సీఎం అన్నారు.