తెరాస, తెదేపాలు సవాళ్ళు దేనికి?

 

 

 హరీష్ రావు: తెలంగాణాకి అనుకూలంగా లేఖ ఇచ్చి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుకు మద్దతు ప్రకటించి, అధికారంలోకి వస్తే తెలంగాణకు చెందిన దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తానని హామీ ఇస్తే, తెరాసను తెదేపాలో విలీనం చేయడానికి మేము సిద్దం.

 

రేవంత్ రెడ్డి: హరీష్ రావు ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాము. అయితే, దానిని తెరాస రాజకీయ కమిటీలో ఆమోదించి, కేసీఆరే స్వయంగా లిఖిత పూర్వకంగా ఇస్తే, మేము కేసీఆర్ కేంద్రానికి వ్రాసి పంపదలచిన ఏ లేఖమీదయినా సంతకం పెట్టడానికి సిద్దం.

 

తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని కేసీఆర్ చెపితే, ఆయన మేనల్లుడు హరీష్ రావు మూడు షరతుల మీద తమ పార్టీని తెదేపాలో విలీనం చేస్తామని తాజాగా ప్రకటించడం, దానిని తెదేపా స్వాగతించడంపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో రసవత్తర చర్చ జరుగుతోంది.

 

సీమంద్రా పార్టీలయిన తెదేపా, వైకాపాలను తెలంగాణా నుండి తరిమికొట్టాలని కేసీఆర్ పిలుపునిస్తుంటే, హరీష్ రావు అదే సీమంద్ర పార్టీలో తమ ఉద్యమ పార్టీని విలీనం చేస్తామని చెప్పడం చూస్తే, రఘునందన్ రావు చెప్పినట్లు తెరాసలో ఆధిపత్యపోరు సాగుతోందని, హరీష్ రావు, కేసీఆర్ ల మధ్య తీవ్ర విభేదాలున్నట్లు స్పష్టం అవుతోంది. లేకుంటే ఆయన ఇటువంటి కీలకమయిన ప్రతిపాదన తనంతట తానుగా చేయడానికి సాహసించేవారు కాదు. అందుకే, తెదేపా నేత రేవంత్ రెడ్డి ‘ఈ ప్రతిపాదనకు కేసీఆర్ ఆమోదం ఉందా లేదా? అని ప్రశ్నించారు.

 

ఏమయినప్పటికీ, హరీష్ రావు ప్రకటన తెలంగాణా ఉద్యమాలలో తెరాస నిబద్ధతపై అనుమానాలు రేకెత్తిస్తోంది. అసలు ఆ పార్టీ లక్ష్యం తెలంగాణా సాధనా లేక వచ్చే ఎన్నికలలో విజయం సాదించడమా? అనే అనుమానం రేకెత్తిస్తోంది. కానీ, ఇటువంటివి వాటిని అవలీలగా కొట్టిపారేయగల వాక్చాతుర్యం కేసీఆర్ స్వంతం గనుక, పార్టీలో లొసుగులు బయటపడకుండా, ఏదో ఒక మెలికతో ఆయన బంతిని మళ్ళీ తెదేపా కోర్టులో పడేయడం ఖాయం.

 

ఇక, రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు ప్రతిపాదనను స్వాగతించడం చూస్తే, మరి ఆయన ప్రతిస్పందనకు చంద్రబాబు ఆమోదం ఉందాలేదా? అనే సంగతి ఆయనే స్పష్టం చేయాలి. వచ్చే ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న చంద్రబాబుని కాదని, తెలంగాణకు చెందిన ఒక దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని పార్టీ తరపున ఆయన చెప్పడం ఎంతవరకు సాధ్యమో, అది సాధికార ప్రతిస్పందనో కాదో ఆయనే చెప్పాలి.

 

ఈ మద్య తరచుగా తెరాస నేతలు, “తెదేపాలో అయితే చంద్రబాబు లేకుంటే బాలకృష్ణ తప్ప తెలంగాణకు చెందిన వారు ఎన్నటికీ ఆ పార్టీ అధ్యక్షులు కాలేరు, ముఖ్యమంత్రి అసలే కాలేరని” తెదేపాలో తెలంగాణా నేతలను రెచ్చగొడుతున్నారు. బహుశః తెదేపాలో తెలంగాణా నేతలు వారి మాటలకు ప్రభావితమయినందునే లోనయ్యరేమోనని రేవంత్ రెడ్డి ప్రతిస్పందన అనుమానాలు రేక్కిత్తిస్తోంది.

 

వచ్చేఎన్నికలలో కాంగ్రెస్, వైకాంగ్రెస్ పార్టీలు ఒకవేళ చేతులు కలిపితే, వాటిని ఎదుర్కోవడానికి మళ్ళీ తెదేప, తెరాసలు పొత్తులు పెట్టుకొని ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా ఈ సవాలు, ప్రతిసవాళ్ళు అన్యాపదేశంగా చెపుతున్నట్లు భావించవచ్చును.

 

ఏమయినప్పటికీ, తమ ఉనికిని నిలుపుకోవడానికి తిప్పలుపడుతున్న తెదేపా, తెరాసాలు ఇటువంటి వివాదాస్పద ప్రకటనలు, విమర్శలు, సవాళ్ళు ప్రతిసవాళ్ళతో మీడియా ద్వారా జనం నోళ్ళలో నిత్యం నానేలా చూసుకొంతున్నాయని చెప్పవచ్చును.