దేశానికి భరోసా ఇవ్వవలసిన యువత కుల పోరాటాలు చేస్తుంటే...

 

ప్రపంచ దేశాలతో పోల్చి చూసినట్లయితే భారతదేశానికి బాగా కలిసివచ్చే అంశం ఏమిటంటే మంచి నైపుణ్యం కలిగిన యువత అధిక సంఖ్యలో కలిగి ఉండటమే. ఇదే విషయం ప్రధాని నరేంద్ర మోడీ మొన్న తన అమెరికా పర్యటనలో కూడా చెప్పారు. కానీ హార్దిక్ పటేల్ వంటి యువకులు తమ నాయకత్వ లక్షణాలను, శక్తి యుక్తులను దేశాభివృద్ధి కోసం వినియోగించకుండా విచ్చినకర పనులకు ఉపయోగించడం చాలా శోచనీయం. పటేల్ కులస్తులకు రిజర్వేషన్ల కోసం అతను మొదలుపెట్టిన పోరాటం వలన దేశంలో అగ్రగామిగా ఉన్న గుజరాత్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. ఆ ఉద్యమం వలన రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువ గల ఆస్తులు బుగ్గి పాలయ్యాయి . ఇంతవరకు 8మంది ప్రాణాలు కోల్పోయారు.

 

హార్దిక్ పటేల్ రాజేసిన ఈ కులచిచ్చు వలన ఒక్క గుజరాత్ రాష్ట్రం నష్టపోవడమే కాకుండా అదిప్పుడు దేశమంతటా క్రమంగా విస్తరిస్తోంది. ఇంతవరకు గుజరాత్ రాష్ట్రానికే పరిమితమయిన తన కుల పోరాటాన్ని ఇప్పుడు దేశమంతా విస్తరించాలనే ఉద్దేశ్యంతో హార్దిక్ పటేల్ ‘అఖిల భారతీయ పటేల్ నవనిర్మాన్ సేన’ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నాడు. కూర్మి, గుజ్జర్లు, మారాఠ, పటేల్ కులస్తులను తన ఉద్యమంలో భాగస్తులుగా చేసుకొని తన ఉద్యమాన్ని రాజస్థాన్, మహారాష్ట్రాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాడు. తమ సంస్థ యువత, రైతులు, కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తుందని హార్దిక్ పటేల్ తెలిపాడు.

 

భారతదేశం వేగంగా అభివృద్ధి చెంది అగ్రరాజ్యాల సరసన నిలబడాలని ప్రయత్నాలు చేస్తుంటే హార్దిక్ పటేల్ వంటివారు తాము రాజకీయంగా ఎదిగేందుకు ప్రజల బలహీనతలను ఈవిధంగా వాడుకొని పైకి ఎదగాలని ప్రయత్నిస్తుండటం చాలా విచారకరం. హార్దిక్ పటేల్ తనకున్న గొప్ప నాయకత్వా లక్షణాలను, శక్తి యుక్తులను ఇటువంటి విచ్చినకరమయిన పనులకు ఉపయోగించే బదులు దేశాభివృద్ధికి ఉపయోగించి ఉండి ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది. అతను ఒక గొప్ప నాయకుడుగా దేశ ప్రజల దృష్టిలో ఎంతో గౌరవం పొందగలిగేవాడు. కానీ షార్ట్ కట్ పద్ధతిలో ఉన్నత స్థాయికి ఎదగడానికి తన శక్తి యుక్తులను ఉపయోగిస్తుండటం చాలా దురదృష్టకరం.

 

భారతదేశంలో ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతమవుతోంది. లోపలనుండి బయట నుండి నిత్యం అనేక సవాళ్లు ఎదుర్కోవలసి వస్తోంది. అనేక సమస్యలను ఎదుర్కొంటూనే అభివృద్ధి పధంలో ముందుకు సాగిపోతోంది. ఇటువంటి సమయంలో దేశానికి వెన్నెముకగా ఉండవలసిన యువతని హార్దిక్ పటేల్ కులం పేరుతో రెచ్చగొట్టి విచ్చిన్నకర, వినాశకర ఉద్యమాలకు ప్రేరేపించడం చాలా అవివేకం. దేశ ప్రజలందరూ తమకి చాలా దేశ భక్తి ఉందనే దృడంగా విశ్వసిస్తుంటారు. బహుశః హార్దిక్ పటేల్ కూడా అలాగే భావిస్తున్నాడేమో? కానీ అతను రాజేసిన చిచ్చుని దేశమంతటా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాడు. దేశానికి ఎవరూ ఏ మేలు చేయక పోయినా పరువాలేదు కానీ నష్టం చేయకుండా ఉంటే చాలు.

 

పటేల్ కులస్థులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్దిక్ పటేల్, దేశంలో కనీసం ఒక్క పూట తిండికి బట్టకి కూడా నోచుకొని కటిక దరిద్రం అనుభవిస్తున్న నిరుపేదలు, చిన్నారులు కోట్ల మంది ఉన్నారనే సంగతి గ్రహిస్తే ఇటువంటి పోరాటాల గురించి ఆలోచించే వాడు కాదు. రైతుల కోసం పోరాడుతామని చెప్పుకొంటున్న హార్దిక్ పటేల్ దేశ వ్యాప్తంగా వేలాది మంది రైతులు ఆర్ధిక బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారని గ్రహిస్తే, కులం కోసం కాక రైతుల కోసం పోరాడి ఉండేవాడు. కానీ తన ఉద్యమాలతో దేశానికి ఇంకా సమస్యలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

 

అగ్గి పుల్లతో దీపం వెలిగించి వెలుగులు పంచవచ్చును. అదే అగ్గిపుల్లతో కొంపకి నిప్పు పెట్టవచ్చును. అగ్గిపుల్ల వంటి హార్దిక్ పటేల్ ఇప్పుడు కొంపకు నిప్పుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కుల,మత, ప్రాంత, బాషా సంకుచిత బేధాల నుండి భారతావనికి విముక్తి కలిగించి భారతీయులు అందరినీ ఒక్క త్రాటిపైకి తెచ్చి దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపించవలసిన ఈ తరుణంలో హార్దిక్ పటేల్ వంటి యువకులే కులం పేరుతో ప్రజల మధ్య అడ్డుగోడలు కడుతుండటం చాలా దురదృష్టకరం.