ఆనందాలని అందిపుచ్చుకుందాం

 

ఇప్పుడు అన్నీ స్లీక్ మోడల్సే. చక్కగా, చూడముచ్చటగా వుండే డిజైన్లదే హవా అంతా. మరి వాడే వస్తువులకే అది పరిమితమైతే ఎలా? మన జీవన విధానం కూడా స్లీక్‌గా, చూడముచ్చటగా వుండద్దూ! ఆనందంగా ఉండటానికి సింప్లిసిటీని మించిన సీక్రెట్ లేదుట. కాబట్టి అనవసరమైనవి వదిలించుకుంటూ, అవసరమైన వాటిని చేర్చుకుంటే మన జీవన విధానాన్ని చూడముచ్చటగా, పొందికగా రూపొందించుకోవడం మన చేతుల్లోనే వుంటుంది. సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని, పున్నమి నాటి చంద్రుణ్ణి హాయిగా చూస్తూ రిలాక్సయ్యి ఎన్ని రోజులైంది? ఈ మధ్యకాలంలో సాధ్యపడిందా? సమాధానం అవును అయితే పర్వాలేదు. 

కానీ కాదంటే మాత్రం ఆలోచించాల్సిందే. ఇప్పటి హడావిడి, పని ఒత్తిడి చిన్న చిన్న ఆనందాలని సైతం కోల్పోయేలా చేస్తున్నాయి. కాబట్టి మొట్టమొదటగా ఆ చిన్న ఆనందాలని అందిపుచ్చుకోవాలి. ఇప్పటి అలవాట్లలో అనవసరమైనవి, ఆనందాన్ని ఇవ్వనివి ఏవైనా వుంటే వాటిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకోవాలి. ఇక ఆ తర్వాత ఆ స్థానంలో మనసుని గెలిచిన ఇష్టాల్ని అలవాట్లుగా మార్చుకోవటమే. కొంచెం కష్టమైనా ప్రయత్నిస్తే కొన్ని రోజులకి ఉషోదయాన్ని చూస్తూ కప్పు కాఫీ తాగడంలోని హాయిని రుచి చూడచ్చు.

 
-రమ