అంతిమ తీర్పు...

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 గుల్మర్గ్‌ సొసైటీ ఊచకోత కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో 24 మందిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. అందులో 11 మందిని హత్యానేరానికి పాల్పడినందుకు భారతీయ శిక్ష్మాస్మృతిలోని సెక్షన్ 302 కింద దోషులుగా నిర్థారించింది. బీజేపీ ప్రస్తుత కార్పోరేటర్ బిపిన్ పటేల్ సహా నిందితుల్లో 36 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దోషులకు ఎంత శిక్ష విధించాలన్నది జూన్‌ 6న వెలువరించే తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేస్తుంది. 66 మంది నిందితుల్లో ఆరుగురు వ్యక్తులు విచారణ కాలంలోనే మరణించారు.

 

2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కి దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అత్యధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చేలరేగాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైర విహారాలు. దహనాలు, లూఠీలు, హత్యలు, మానభంగాలు, సజీవ దహనాలతో 150కి పైగా పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేల కోట్ల ఆస్తి బుగ్గిపాలయ్యింది. సరిగ్గా ఆ సమయంలోనే 2002 ఫిబ్రవరి 28న గుల్బర్గ్ సోసైటీ నివాసాలపై అల్లరి మూకలు దాడి చేశాయి. కనిపించిన వారినల్లా నరికేసింది. ఆస్తులను తగులబెట్టింది. అక్కడే నివసిస్తున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ పోలీసులకు, రాజకీయ నేతలకు ఫోన్లు చేశారు. అయినా ఎవరి నుంచి స్పందన లేదు. ఇంతలోనే ఆయనను దుండగులు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి కత్తులతో నరికి తగులబెట్టారు.

 

ఈ సంఘటనపై ఎంపీ భార్య జకియా జాఫ్రీ న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగారు. దిగువ కోర్టుల్లో నిందితులకు క్లీన్ చీట్ రావడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఘటనపై విచారణ కోసం సుప్రీం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. సిట్ అందజేసిన నివేదికలో అనేక వాస్తవాలు బయటకు వచ్చాయి. బాధితులు సజీవ దహనం చేయబడ్డారనడానికి అక్కడ లభించిన మృతదేహాలే సాక్ష్యమని, అవన్నీ పూర్తిగా కాలిపోయాయని తెలిపింది. పెట్రోల్ క్యాన్లు, కర్రలు, కత్తులు కూడా ఘటనా స్థలంలో దొరికాయాని, దాన్ని బట్టి అక్కడ మారణ హోమం ఏ స్థాయిలో జరిగిందో వివరించింది. సిట్ నివేదిక ఆధారంగా అహ్మదాబాద్ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ సంఘటనపై అందరూ మొదటగా వేలెత్తి చూపేది ప్రస్తుత ప్రధాని..నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీనే. అల్లర్లు దావానంలా వ్యాపిస్తున్నా వాటిని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్నది ప్రధాన అభియోగం. పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని మతోన్మాద శక్తులకు వెన్నుదన్నుగా నిలిచారని, మోడీ అండదండలతోనే అల్లరి మూకలు చెలరేగిపోయాయని ఆయన ఇప్పటికి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.  ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానం నియమించిన రాఘవన్ కమిటీ కూడా మోడీని తీవ్రంగా విమర్శించింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి పక్షపాతంగా వ్యవహరించారని, ముస్లింలపై దాడులు జరుగుతున్నా వారిని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని నివేదికలో తెలిపింది.

 

చివరకు ఇన్నేళ్ల నిరీక్షణ ఫలితంగా తీర్పు వెలువడింది. కాని ఈ తీర్పుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ సతీమణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 36 మందిని నిర్దోషులుగా ప్రకటించడం అన్యాయమని, మనుషుల్ని చంపి, ఆస్తి విధ్వంసానికి పాల్పడ్డవారిని శిక్షించాల్సిందేనని జాకియా అన్నారు. వారు మనుషుల్ని చంపడం తాను కళ్లారా చూశానని ఒక మహిళగా వారిని మరణదండన విధించాలని కోరే సాహసం చేయలేనని, కానీ కఠినశిక్ష విధించాలన్నారు. మొత్తం 400 మంది దాడిలో పాల్గొంటే 24 మందినే దోషులుగా ఎలా నిర్థారించారని జాఫ్రీ కుమారుడు తన్వీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.