కొందరిలో కృతజ్ఞత ఎందుకు ఉండదు?

మనకి ఎవరన్నా సాయం చేసినా, మంచి బహుమతిని అందించినా వారి అభిమానం పట్ల సంతోషం కలుగుతుంది. ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనిపిస్తుంది. బహుశా కృతజ్ఞత అంటే అదేనేమో! కానీ కొందరిలో ఈ తరహా భావనలు మచ్చుకైనా కనిపించవు. కారణం!

 

కృతజ్ఞత – ఆత్మస్థైర్యం

తన మీద తనకి నమ్మకం ఉండి ఇంకొకరి మీద ఆధారపడని స్వభావం వ్యక్తులలో కృతజ్ఞత పాళ్లు తక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. ఇందుకోసం వారు ఓ 500 మంది అభ్యర్థులను ఆహ్వానించారు. ‘మీరు మీ స్నేహితుల దగ్గర నుంచి ఏదన్నా బహుమతి కానీ, సాయం కానీ పొందినప్పుడు మీలో ఎలాంటి భావనలు కలుగుతాయి,’ అంటూ వారిని అడిగారు. అలాంటి ప్రశ్న ఎదురైనప్పుడు ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉన్న అభ్యర్థులు- ‘అలాంటి సాయాలు, బహుమతులూ తమ మీద ఏమంత సానుకూల ప్రభావాన్ని చూపవని’ పెదవి విరిచారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు మూడుసార్లు అడిగినా ఇలాంటి జవాబులే లభించాయి.

 

వ్యక్తిత్వమే అడ్డంకి

ఆత్మస్థైర్యం మరీ ఎక్కువగా ఉన్నవారు తమ విలువని ఎలా పెంచుకోవాలి అన్న తాపత్రయంలో ఉంటారే కానీ... బంధంలోని అవతలి వ్యక్తికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనే తపన వారిలో కనిపించదు. పైగా కృతజ్ఞత అనే లక్షణం వల్ల తాము బలహీనురం అయిపోతామన్న భయం కూడా వారిలో ఉంటుంది. అంతేకాదు! ఇలాంటి వ్యక్తులకు ఎవరన్నా సాయం చేయడానికి ముందుకు వస్తే... తమ వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకుంటున్నారన్న అపోహకి లోనయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

 

కృతజ్ఞత ఉండాలా! వద్దా!

మానవ విలువలు మారిపోతున్న ఈ కాలంలో కృతజ్ఞత అనేది కేవలం మన బలహీనతకు చిహ్నమా! అంటే కానే కాదంటున్నారు పరిశోధకులు. నిజానికి మానవ సంబంధాలలో కృతజ్ఞత ప్రాధాన్యత గురించి చాలా పరిశోధనలే జరిగాయి. కృతజ్ఞత అనే లక్షణం బంధాలను నిర్మించుకునేందుకు, నిలిపి ఉంచుకునేందుకు చాలా అవసరం అని మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చేశారు. దాని వలన మనిషి మానసికంగానూ, శారీరికంగానూ ఆరోగ్యంగా ఉంటాడని చెబుతున్నారు. ఇక ఆత్మస్థైర్యం మరీ ఎక్కువగా ఉన్నవారిలో, కష్టసుఖాలను ఇతరులతో పంచుకునే అలవాటు లేకపోవడం వల్ల క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలు పెట్రేగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ ఇతరుల అభిప్రాయాలనీ, బంధాలనీ బలిపెట్టే స్థాయిలో అది ఉండకూడదు. అప్పుడు ఆత్మస్థైర్యం కాస్తా అహంకారానికీ, ఒంటరితనానికి దారితీస్తుంది. అయితే ఈ ఉరుకులపరుగుల జీవితంలో ఆత్మస్థైర్యం మీద ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారని పరిశోధకులు వాపోతున్నారు. అమెరికా వంటి దేశ సంస్కృతిలో బంధాలకంటే వ్యక్తిగత స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. అందుకని ఇప్పుడు సంస్కృతికీ, కృతజ్ఞతకీ మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనే దిశలో మరో పరిశోధనకు పూనుకొంటున్నారు.

 

- నిర్జర.