నవ్యాంధ్రలో కొలువుల నగారా..!

నవ్యాంధ్రలో ప్రభుత్వోద్యోగాల ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 10 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీపీఎస్సీ, ఏపీ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్దులకు అనుమతినిస్తూ ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నియామకాల్లో పోలీసులకు పెద్దపీట వేస్తూ..మొత్తం పోస్టుల్లో సగానికి పైగా ఈ శాఖ నుంచే భర్తీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఇంతవరకు ఎలాంటి నోటీఫికేషన్ వెలువడలేదు..ఈ ఏడాదైనా ఉద్యోగాల భర్తీ ఉంటుందో లేదో అని కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఇంత పెద్ద ఎత్తున ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తెరతీయడం నిరుద్యోగులను ఆనందంలో ముంచెత్తింది.

 

రాష్ట్ర విభజన సమయంలో 13 జిల్లాల అవశేష ఆంధ్రప్రదేశ్‌లో 1,42,825 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కమల్‌నాథన్ కమిటీ గుర్తించింది. 2014 జూన్ 2 తరువాత ఉద్యోగుల పదవీ విరమణ వయసును మరో రెండేళ్లకు పెంచడంతో ఆ గడువు తీరిన వారు ఈ జూన్‌లో దాదాపు 30 వేల మంది రిటైర్ కానున్నారు. ప్రభుత్వ కార్యాకలాపాలను అమరావతి నుంచే సాగించాలనుకుంటున్న సీఎంకు ఉద్యోగుల కొరత సమస్యగా తయారవుతుంది. మరో వైపు సోదర తెలుగు రాష్ట్రం తెలంగాణలో నోటిఫికేషన్లు వరుసగా వస్తుంటే..ఏపీలో విభజన తర్వాత ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదంటూ నిరుద్యోగుల్లో నిరాశ పెరిగిపోతోంది..పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వారిలో అసహనం శృతిమించుతోంది.

 

ఇంకోవైపు ఖాళీ పోస్టుల భర్తీకి వీలుగా వివిధ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం అనుమతుల కోసం ఏపీపీఎస్సీ నిరీక్షిస్తోంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న టీడీపీ ప్రభుత్వం వీలైనంత త్వరగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే ఏపీపీఎస్సీ ద్వారా 4,009 ఖాళీలు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 5,991 ఖాళీల్ని భర్తీ చేస్తారు. గ్రూప్‌-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో వెయ్యి పోస్టులను ప్రభుత్వం గుర్తించింది. అలాగే వైద్య ఆరోగ్య విభాగంలో 422 ఖాళీలున్నాయి. వివిధ శాఖల్లోని సాంకేతిక సంబంధిత పోస్టులు 1,000 ఉన్నాయి. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా సివిల్ విభాగంలో ఎస్సైలు 287, మహిళ ఎస్సైలు 110, కానిస్టేబుళ్లు 1,103, మహిళా కానిస్టేబుళ్లు 60 భర్తీకానున్నాయి. 

 

రాజధానికి ప్రాధాన్యత..
కొత్త రాజధానిలో కొత్త తరహా పరిపాలన సాగించాల్సిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి అమిత ప్రాధాన్యతనిచ్చింది ప్రభుత్వం. విజయవాడ పోలీస్ కమిషనరేట్, గుంటూరు అర్బన్, రూరల్, జిల్లా విభాగాలను పటిష్టపరిచనున్నారు. తుళ్లురు సబ్‌డివిజన్‌లో అవసరమైన మేరకు పోలీసు నియామక ప్రక్రియను చేపడుతున్నారు.