Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మాటను బట్టి మనిషి, మనిషిని బట్టి మాట అని ఎందుకన్నారు?
posted on: Sep 29, 2022 9:30AM

ఎదుటివాడి అహంకారాన్ని సంతృప్తిపరుస్తూ, వాడిని అర్థం చేసుకుంటూ గౌరవంగా ప్రవర్తించటం వ్యక్తి ఔన్నత్యానికి నిదర్శనం. అంతే తప్ప 'ఎదుటివాడిని గౌరవించటం నా స్థాయికి భంగం కలిగిస్తుందన్నట్టు ప్రవర్తించటం సమంజసం కాదు. మనం బ్యాంకుకు వెళ్తాం. చిరునవ్వుతో, ఓపికగా సమాధానం ఇచ్చేవారిని గౌరవిస్తాం. వారి దగ్గరకే మళ్ళీ మళ్ళీ వెళ్తాం. విసుక్కునేవారిని అసహ్యించుకుని దూరం పోతాం. కాబట్టి నోరారా, ప్రేమగా వ్యక్తులను, గౌరవించి, పలకరించటం వ్యక్తిత్వవికాసంలో అత్యంత ఆవశ్యకమైన అంశం. ఈ అంశాన్ని ఎంతో నైపుణ్యంతో నేర్పుతాడు నన్నయ, ఈ కింది పద్యంలో….
నిండుమనంబు నవ్యనవ
నీతసమానము పల్కు దారుణా
ఖండల శస్త్రతుల్యము జ
గన్నుత విప్రుల యందు నిక్క మీ
రెండును, రాజు లందు విప
రీతము గావున విప్రు డోపు, నో
పం డతి శాంతుడయ్యు నర
పాలుడు శాపము గ్రమ్మఱింపగన్||
ఉదంకుడనే మహర్షి, గురుదక్షిణ కోసం పౌష్యుడనే మహారాజు దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఉదంకుడు తాత్కాలికంగా విచక్షణను మరచిపోతాడు. దాంతో కోపాలు పెరుగుతాయి. రాజు, మహర్షి ఒకరిని ఒకరు శపించుకుంటారు. తరువాత ఇద్దరూ తమ తప్పును గ్రహిస్తారు. మహర్షి తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. రాజు ఉపసంహరించుకో లేకపోతాడు.
మహర్షుల మనస్సు నవ్యనవనీతసమానం. నిండైనది. దాంట్లో క్రోధం ఉండదు. ఉన్నా తాత్కాలికమే. వారికి కోపం వస్తే వారి పలుకు వజ్రాయుధం లాంటిది. కానీ వారి మనస్సు వెన్నలాంటిది కావటంతో శాపాన్ని ఉపసంహరించుకోగలుగుతారు. ఎందుకంటే వారి కోపంలో స్వార్ధం లేదు. క్రోధం తాత్కాలికమే. కానీ రాజులు అలాంటివారు కాదు. వారు కపటులు, వారి మాట మెత్తగా ఉంటుంది. హృదయం శస్త్రసమానమైందిగా ఉంటుంది. రాజ్యం నడిపేందుకు రకరకాల వేషాలు వేయాలి. అధికారం నిలుపుకునేందుకు కుట్రలు పన్నాలి. వారి నిజాయితీలో స్వార్థం ఉంటుంది. వారి క్రోధం దీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి వారు శాపాన్ని ఉపసంహరించుకోలేరు.
ఇదీ మనకు అనుభవమే. ఒక వ్యక్తి మనకు సన్నిహితుడు. అతడు ఒకోసారి కోపంగా తిట్టినా మనం పట్టించుకోం. కోపం తగ్గిన తరువాత అతడే మన దగ్గరకు వస్తాడు, క్షమాపణ వేడుకుంటాడు. ఇక్కడ 'మాట' కన్నా మనసు ప్రాధాన్యం వహిస్తుంది. అంటే, వాక్కు ఎంత కఠినంగా ఉన్నా, మనస్సు మెత్తనైతే వాక్కులోని కాఠిన్యం, తీవ్రతలు తగ్గుతాయి. అందుకే, తల్లిదండ్రులు ప్రేమ కురిపిస్తూ, అప్పుడప్పుడు కఠినంగా వ్యవహరించినా, పిల్లవాడు వారి ప్రేమను అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడే వ్యక్తి నోరార పిలవటం, ప్రేమగౌరవాలు ప్రదర్శించటం వంటి అంశాలు ఉపయోగిస్తాయి.
కాబట్టి మన నిత్యజీవితంలో అనుక్షణం 'మాట' ప్రాధాన్యం వహిస్తుందని గ్రహించాలి. ఎదుటివారికి మనం మన మాట ద్వారానే అర్ధమౌతాం. కాబట్టి మాట స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. డొంక తిరుగుడుగా, వ్యంగ్యంగా, నిష్టురంగా మాట్లాడటం వల్ల లాభం లేదు. నిజాయితీగా, సత్యం పలకటం వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే ఈ సత్యం కూడా కుండ బద్దలు కొట్టినట్టు ఉండకూడదు. అప్రియమైన దాన్ని కూడా ప్రియంగా అయ్యేట్టు చెప్పాలి. అమంగళకరమైనదాన్ని కూడా మంగళకరమైన పదాలతో చెప్పాలి. ఇందుకు మనం 'వాక్కు' శక్తిని అర్ధం చేసుకోవాలి.
మన లోంచి వెలువడుతున్న వాక్కు సరస్వతీస్వరూపం అని గ్రహించాలి. మనం మాట్లాడే ప్రతి మాటా ఆ వాగ్దేవికి మనం అర్పిస్తున్న నీరాజనంలా భావించాలి. అప్పుడు మన 'మాట' కొక కొత్త సొగసు వస్తుంది. ప్రతి మాటా ఆ వాగ్దేవి అర్చన గీతంలా పవిత్రతను ఆపాదించుకుంటుంది. స్వచ్ఛమైన, స్పష్టమైన వాక్కు ఆనందాన్ని కలిగించటమే కాదు, ఆరోగ్యానికి హేతువవుతుంది. అందుకే 'మాటను బట్టి మనిషి, మనిషిని బట్టి 'మాట' అన్నారు పెద్దలు.
◆నిశ్శబ్ద


.webp)



