మానవత్వ పరిమళం

ఇది చిన్న పిల్లల కథే... కానీ మనం కూడా అందులో నుంచి నేర్చుకునేది ఎంతో కొంత ఉందనిపించింది. అనగనగా ఓ రాజు. ఆ రాజుకి నలుగురు కొడుకులు. నలుగురూ అన్ని విద్యల్లో ఆరితేరిన వారే. తెలివైన వారు కూడా. అయితే ఓ రాజుగా రాజ్యభారాన్ని తీసుకునే వారికి తెలివితేటలు, సకల విద్యలే కాదు ధర్మం, న్యాయం వంటి వాటిపైనా కూడా అవగాహన ఉండి తీరాలని నమ్మిన ఆ రాజు తన నలుగురు కొడుకులని పిలిచి ఇలా చెప్పాడు. మీ నలుగురు రాజ్యంలో తిరగండి. మీకు ఎవరు అందరికంటే నిజమైన ధర్మాత్ముడని అనిపిస్తాడో అతనిని నా దగ్గరకి తీసుకురండి అంటాడు. అలా ఎవరైతే నిజమైన  ధర్మాత్ముడిని గుర్తించి తెస్తారో వాళ్ళనే రాజుగా నియమిస్తాను అంటాడు.

రాజు చెప్పిన మాటలు విన్న అతని నలుగురు కొడుకులు గుర్రాలెక్కి రాజ్య సంచారానికి బయలుదేరుతారు. కొన్నాళ్ళు గడిచాయి. ఇంతలో రాజుగారి పెద్దకొడుకు ఓ శేఠ్‌ను వెంటపెట్టుకు వస్తాడు. అతని గురించి సభలో చెప్పమంటాడు  రాజు. ఈ శేఠ్‌ నిత్యం ఎన్నో దానధర్మాలు చేస్తుంటాడు. పూజలు, వ్రతాలు చేస్తుంటాడు. ఇతనిని మించిన ధర్మాత్ముడు నాకెవరూ కనిపించలేదు అంటాడు రాజు పెద్దకొడుకు. అది విన్న రాజుగారు "నిజంగా ధర్మాత్ముడే" సంతోషం అంటూ ఆ శేఠ్‌ను సత్కరించి పంపిస్తాడు. 

ఆ తర్వాత రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువస్తాడు. ఆ బ్రాహ్మణుడు అన్ని తీర్థయాత్రలు కాలినడకన చేసాడని, అసత్యం పలకడని, కోపం లేనివాడని చెపుతాడు. రాజుగారి రెండవ కొడుకు తీసుకువచ్చిన బ్రాహ్మణుడి గురించి విన్న రాజుగారు సంతోషించి అతనికి కానుకలిచ్చి, సత్కరించి పంపిస్తాడు. 

ఆ తర్వాత మూడో కుమారుడు ఓ బాబాజీని వెంట పెట్టుకువస్తాడు. ఆ బాబాజీ ఎంతో నిష్టతో తపస్సు చేస్తుంటాడని, నీరు తప్ప మరేది తీసుకోకుండా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడని చెబుతాడు. బక్కచిక్కిన శరీరంతో, తేజస్సు నిండిన కళ్ళతో ఉన్న ఆ బాబాజీకి నమస్కరించిన రాజు. ఇతను కూడా ధర్మాత్ముడేనని చెబుతాడు. ఇలా ముగ్గురు కొడుకులు తీసుకువచ్చిన వ్యక్తులని సత్కరించి పంపిన రాజు తన నాలుగో కొడుకు కోసం ఎదురుచూస్తుంటాడు. 

కొన్నాళ్ళకి నాలుగో కొడుకు ఓ బక్కచిక్కిన, మాసిన బట్టలు వేసుకున్న ఓ రైతుని వెంటబెట్టుకువస్తాడు. అతనిని చూసి సభలో అందరూ నవ్వుతారు. పొట్ట కూటికోసం మన్నులో పనిచేసే ఇతను ధర్మాత్ముడా! అని హేళన చేస్తారు. రాజుగారు అందరిని ఆగమని ఇతను ధర్మాత్ముడు అని ఎలా గ్రహించావు అని కొడుకుని అడుగుతాడు. అందుకు అతను ఈ రైతు గాయం తగిలిన కుక్కని చేరదిసి దాని బాగోగులు చూస్తున్నాడు. అలాగే తను తినే నాలుగు మెతుకులలోనే కొంత పశుపక్ష్యాదులకి, నిస్సహాయులకి ఇస్తున్నాడు. అందరికంటే ఇతనే ధర్మాత్ముడనిపించి తీసుకు వచ్చాను అని చెబుతాడు. 


రాజుగారు ఆ రైతుని సత్కరించి కానుకలు ఇచ్చి అందరికంటే ఇతనే గొప్ప ధర్మాత్ముడని ప్రశంసిస్తాడు. పూజలు, వ్రతాలు, దానధర్మాలు, తపస్సు ఇవన్నీ గొప్ప ధర్మాలే. కానీ అన్నిటికంటే గొప్ప ధర్మం నిస్సహాయ స్థితిలో ఉండి, అర్థించటం కూడా రాని ప్రాణిని ఆదుకోవటం, అలాగే ఉన్నదానిలోనే నలుగురికి పెట్టడం. ఇతరులకి సహాయపడే ఇతని ధర్మమే నిజమైన ధర్మం అంటూ నాలుగో కొడుకుని తన తరువాత రాజుగా ప్రకటిస్తాడు రాజు. ఇది కథ మనం గ్రహించాల్సిన అంశామేదో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు కదా. 

-రమ ఇరగవరపు