TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్ర విభజన ఖరారు చేసే కీలక సమావేశం

Published on: Mon Nov 18, 2013 7:39AM

 

రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలయిన నాటి నుండి అనేక ప్రకటనలు, సమావేశాలు. వాటికి ముందు అంతులేని ఊహాగానాలు, తరువాత విశ్లేషణలు, విమర్శలు. ఈ తతంగమంతా చూస్తే బహుశః రాష్ట్ర విభజన ఈవిధంగానే చేయలేమో! అనే విధంగా తయారయింది. ఈ రోజు మళ్ళీ మరో కీలక సమావేశం. మళ్ళీ అన్నీషరా మామూలే.

 

కేంద్రమంత్రుల బృందం తెలంగాణా, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో, చివరిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఈ రోజు భేటీ కాబోతోంది. ఈ సారి సమావేశంలో మూడు ఆసక్తికరమయిన విషయాలున్నాయి.

 

1.రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, మొక్కుబడిగా ఒకసారి రాష్ట్ర విభజనను వ్యతిరేఖించిన తరువాత సీమాంధ్రకు ఎటువంటి ప్యాకేజి కావాలనుకొంటున్నారో చెప్పబోతున్నారు. ఇది తెలంగాణా వాదులకు ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా మారుతుంది. వారి తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విభజనను వ్యతిరేఖిస్తూ మారోమారు వాదనలు వినిపించబోతున్నారు. కానీ దానివల్ల విభజన ప్రక్రియ ఆగకపోయినా, ఆయన సమైక్యవాదిగా మరింత గొప్ప పేరు సంపాదించుకొనేందుకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది.

 

2. ఇంతవరకు తెలంగాణా అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడని జైపాల్ రెడ్డి, ఇప్పుడు తెర ముందుకు వచ్చి తెలంగాణా కేంద్రమంత్రులకు నేతృత్వం వహించబోతున్నారు. తెలంగాణా ఏర్పాటు ఇప్పటికే దాదాపు ఖాయమయిన ఈ సమయంలో ముందుకు దూసుకువచ్చిన ఆయన, ఈ విజయం తన స్వంతం చేసుకోబోతున్నారు.

 

3. రాష్ట్ర విభజన అంశంపైనే కాక రాజకీయంగా కూడా ప్రత్యర్దులయిన ఇద్దరు రెడ్లు-కిరణ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి తమ తమ రాజకీయ భవితకు ఈ సమావేశం ద్వారానే బలమయిన పునాది వేసుకొనేందుకు ప్రయత్నించబోతున్నారు.

 

ఇక రాష్ట్రం నుండి ఒక్క ముఖ్యమంత్రి నుండి తప్ప ఇతరత్రా ఎటువంటి బలమయిన ప్రతిఘటన లేనందున ఈరోజు సమావేశంతో రాష్ట్ర విభజనకు మార్గం సుగమం అయినట్లే. అందువల్ల కాంగ్రెస్ అధిష్టానం కేవలం ముఖ్యమంత్రిని సరి చేయడమో లేక తప్పించడమో చేసినట్లయితే ఇక రాష్ట్ర స్థాయిలో ఈ సమస్యను అధిగమించినట్లే చెప్పవచ్చును.