జి.హెచ్.యం.సి. ఎన్నికలు అందుకే ఆలస్యం అవుతున్నాయా?

 

 

ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు జి.హెచ్.యం.సి. ఎన్నికలు నిర్వహించబడలేదు. కనీసం ఈ ఏడాదిలోగా నిర్వహిస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. కారణం పెరిగిన జనాభాకి అనుగుణంగా జి.హెచ్.యం.సి. పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియా పూర్తి కాకపోవడమేనని ప్రభుత్వ వాదన. ప్రస్తుతం 150 వార్డులుండగా వాటిని 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. కానీ జనాభా ప్రాతిపదికన విభజించడానికయితే అంత సమయం అవసరం లేదని ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ సభ్యుల వాదన.

 

జి.హెచ్.యం.సి. పరిధిలో కాంగ్రెస్, తెదేపా, బీజేపీ, మజ్లీస్ పార్టీలకి ఉన్నంత పట్టు తెరాసకు లేకపోవడంతో ఈ పునర్విభజన ద్వారా తన పట్టు పెంచు కోవాలని ప్రయత్నిస్తోందని వారి వాదన. ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించిన వార్డుల పునర్విభజన ప్రణాళికను చూసినట్లయితే ఆ సంగతి స్పష్టం అవుతుందని వారు వాదిస్తున్నారు. తెరాస ఎమ్మేల్యేలు సి. కనక రెడ్డి, టి.పద్మారావు గౌడ్ మరియు ఎం.సుదీర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్ గిరీ, మేడ్చల్, సికింద్రాబాద్ నియోజక వర్గాల క్రిందకు వచ్చే ప్రాంతాలలో వార్డుల సంఖ్యను పెంచడం ద్వారా అక్కడ అదనపు స్థానాలు సంపాదించవచ్చని తెరాస ఎత్తు వేసిందని వారు అభిప్రాయపడుతున్నారు.

 

అదే విధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్ పేట, జి.హెచ్.యం.సి పరిధిలో బీజేపీ మరియు ఇతర పార్టీలకి బాగా పట్టున్న ప్రాంతాలలో వార్డులను కుదించడం ద్వారా వారికి అడ్డు కట్ట వేయాలని చూస్తోందని అభిప్రాయం వ్యక్తం చేసారు. వార్డుల పునర్విభజన కేవలం జనాభా ప్రాతిపదికన జరపాలి కానీ పార్టీల బలాబలాల ప్రాతిపదికన కాదని వారు వాదిస్తున్నారు. ఈ కూడికలు తీసివేతల కారణంగానే వార్డుల పునర్విభజన ప్రక్రియలో ఆలాసం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu