డిశంబర్ 25 తరువాత జి.హెచ్.ఎం.సి.ఎన్నికల నోటిఫికేషన్?

 

జి.హెచ్.ఎం.సి. (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్) ఎన్నికల నిర్వహణకి హైకోర్టు జనవరి నెలాఖరు వరకు గడువు విధించడంతో అందుకు అంగీకరించిన తెలంగాణా ప్రభుత్వం జనవరి 20-25 తేదీల మధ్య జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. వచ్చే నెల క్రిస్మస్ పండుగ తరువాత అంటే డిశంబర్ 25 తరువాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల షెడ్యూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలపై ప్రతిపక్షాలతో చర్చించేందుకు ఈ శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతోంది. రేపటి నుండి సవరించిన ఓటర్ల జాబితలను ఆయా వార్డు కార్యాలయాలలో ప్రజల పరిశీలన కొరకు ఉంచి నోటిఫికేషన్ విడుదల చేసేవరకు సవరణలు, కొత్తగా ఓటర్ల నమోదుకి అవకాశం కల్పిస్తారు. డిశంబర్ 8 నుండి 15లోగా వార్డుల వారిగా నిర్ణయించిన రిజర్వేషన్ల వివరాలను ప్రకటిస్తారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నిర్వహణకు సుమారు 40 వేల మంది సిబ్బంది, 5 వేల ఈవీఎంలు ఏర్పాటు కోసం ప్రభుత్వం జి.హెచ్.ఎం.సి.కమీషనర్ కి లేఖ వ్రాసింది.