జి.హెచ్.యం.సి. ఎన్నికలు డిశంబర్ లోనే

 

తెలంగాణా ప్రభుత్వం కోరుకొన్న విధంగానే జి.హెచ్.యం.సి.ఎన్నికలను ఈ ఏడాది డిశంబర్ 15 లోపు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించింది. కానీ అక్టోబర్ 31లోగా వార్డుల విభజన ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ఆదేశించింది. గతేడాది డిశంబర్ 3నే జి.హెచ్.యం.సి.బోర్డు కాలపరిమితి ముగిసిన్పటికీ, వార్డుల పునర్విభజన చేయాలనే సాకుతో ఇంతవరకు జి.హెచ్.యం.సి.ఎన్నికలు వాయిదా వేసుకొంటూ వచ్చిన తెలంగాణా ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు డిశంబరు వరకు గడువు కోరినప్పుడు కోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ తెలంగాణా ప్రభుత్వ వాదనలు విన్న తరువాత డిశంబర్ 15 లోపు జి.హెచ్.యం.సి.ఎన్నికలను నిర్వహించేందుకు అనుమతిస్తూ ఈరోజు హైకోర్టు తుది తీర్పు చెప్పింది.

 

ప్రస్తుతం జి.హెచ్.యం.సి. పరిధిలో 150 వార్డులున్నాయి. వాటిని పెరిగిన జనాభాకి అనుగుణంగా 200కి పెంచాలని తెలంగాణా ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక జి.హెచ్.యం.సి.ని రెండు లేదా మూడు భాగాలుగా విభజించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమయినపటికీ జి.హెచ్.యం.సి. ఎన్నికలు ఖచ్చితంగా ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయం ఇప్పుడు స్పష్టమయింది. తెరాసతో సహా అన్ని రాజకీయ పార్టీలకు తగినంత సమయం చిక్కుతోంది కనుక అప్పటిలోగా అన్ని పార్టీలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నధం కావచ్చును.