గంటా గంట కొట్టేసినట్లేనా? మరి డుమ్మా ఎందుకు కొట్టినట్లు?

 

రాజకీయాల్లో అతని రూటే సెపరేటు... పార్టీ ఏదైనా, స్థానం ఎక్కడైనా గెలుపు గంట మోగాల్సిందేనన్నది అతని ఫిలాసఫీ... ఇప్పుడు కూడా విన్నింగ్ బెల్ మోగింది... కానీ సైకిల్‌ పంక్చరై కూర్చుంది.... అసలే చేతిలో పవర్‌ లేకపోతే అల్లాడిపోయే ఆయన... ఇప్పుడు ఏ పార్టీలో అధికార గంట మోగించాలా..అంటూ తెగ మధనపడిపోతున్నారట. ఫ్యాన్ చెంతకు వెళ్లి సేదతీరాలా... లేక రారా రమ్మంటున్న పువ్వు పరిమళానికి ఆకర్షితుడు కావాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారట. తన పొలిటికల్ ఫ్రెండ్స్ సుజనా... తిన్నావా అంటూ పలకరిస్తున్నా, మరోవైపు సీఎం రమేష్‌ రారమ్మంటూ పిలుస్తున్నా, వెళ్లాలా వద్దా అని తెగ థింక్ చేస్తున్నారట. అయితే గలగల గంట మోగించే ఆయన, నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టారనే మాట వినిపిస్తోంది.

ఇంతకీ ఇతనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది... ఇంకెవరు గంటా శ్రీనివాసరావే.... ఇంతకీ ఇతని గురించి ఇప్పుడెందుకనుకుంటున్నారా? ఎందుకంటే, టీడీపీ ఓటమి తర్వాత మొట్టమొదటిసారి జరిగిన కీలక సమావేశానికి ఈ గంటా సారు డుమ్మాకొట్టారు. గంటా సారుకి ప్రతిపక్షంలో కూర్చోవడమంటే అస్సలు ఇష్టముండదట. అందుకే పార్టీ మారైనా సరే పదవి సంపాదిస్తారని అంటారు. అందుకే వైసీపీలోకి వెళ్లి ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేశారట. కానీ పార్టీలోకి రావాలంటే, రాజీనామా చేయాల్సిందేనన్న జగన్‌ నిబంధనతో చేసేదేమీలేక ఆగిపోయారట. ఇక మిగిలింది బీజేపీ. అయితే, తనతోపాటు పది పదిహేను మంది ఎమ్మెల్యేలతో కమలం గూటికి వెళ్తారంటూ తెగ ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదంటూ ఓ చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా, రూమర్లు మాత్రం ఆగలేదు. రాను రాను సైలెంట్ అయిపోవడం, పార్టీ కార్యక్రమాలకు, నియోజవర్గానికి దూరంగా ఉండటంతో, పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. దీనికితోడు అసెంబ్లీ అంత హాట్‌హాట్‌గా జరిగినా, గంటా మాత్రం సైలెంట్‌గా ఉండటం ఈ ప్రచారానికి మరింత బలమిచ్చింది. ఇప్పుడు టీడీపీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో పార్టీ మారడం ఖాయమనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. అసలే పదవి లేకపోతే ఉండలేరు... పైగా పీఏసీ ఛైర్మన్‌ పదవి దక్కకపోవడంతో, మరింత అసంతృప్తితో ఉన్నారట. 

మొత్తానికి గంటా డుమ్మాపై టీడీపీ విస్తృతస్థాయి మీటింగ్లో వాడివేడి చర్చ జరిగిందట. గంటాపై వేటు వేయాల్సిందేనని పలువురు నేతలు చంద్రబాబును గట్టిగా కోరారట. మరి గంటా మౌనం వీడతారా? లేక అంతకంటే ముందే బాబు నిర్ణయం తీసుకుంటారా? ఎవరో ఒకరు మౌనం వీడితే తప్ప ఈ గంట మోగుతుందో లేక సైలెంట్ గా అలాగే కంటిన్యూ అవుతుందో తేలుతుంది.