TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మెదక్ లో ముమ్మరంగా గంజాయి సాగు

Published on: Mon Apr 2, 2012 3:06PM

మెదక్ జిల్లాలో గిరిజన తండాల్లో పెద్ద ఎత్తున గంజాయిని సాగుచేస్తున్నారు. గతంలో ఏవో కొన్నిచోట్ల మాత్రమే కొద్ది మొత్తంలో గంజాయిని సాగుచేసేవారు. అయితే ఇప్పుడు కొందరు వ్యాపారుల పెట్టుబడితో గిరిజనులు, లంబాడా తెగకు చెందినవారు వందలాది ఎకరాల్లో గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా సాగుచేస్తున్నారు. గంజాయి సాగు చేసినందుకు ఈ వ్యాపారులు ఎకరానికి 25 నుంచి 35వేల రూపాయల వరకు డబ్బు చెల్లిస్తున్నారు. గంజాయి సాగుకు అవసరమైన విత్తనాలను కూడా వ్యాపారులే సమకూరుస్తున్నారు. దీంతో ఈ సాగు వందలాది ఎకరాల్లో విస్తరించింది.

 

ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు అప్పుడప్పుడు ఈ తండాలపై దాడులు చేసి మొక్కలను ధ్వంసం చేస్తున్నారు. అయినా సాగు విస్తీర్ణం మాత్రం తగ్గటం లేదు. తాజాగా నారాయణ్ ఖేడ్ మండలంలోని హంగిర్ల పంచాయితీ పరిధిలో గోప్యానాయాక్ తండా శివార్లలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి సుమారు లక్షన్నర గంజాయి మొక్కలను ద్వంసం చేశారు. ఈ పంట విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయలు వుంటుందని ఎక్సైజ్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. జిల్లాలో వందలాది కోట్ల రూపాయల గంజాయి సాగుగుట్టుగా సాగుతున్నా అధికార యంత్రాంగం సరిగా స్పందించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.