పండ్లు ఆ సమయంలోనే తినాలా?!

ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిది అని అడగ్గానే ఫ్రూట్స్ అని అందరూ ఠక్కున చెప్పేస్తారు. నిజమే. పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే వాటిలో ఉండే పోషకాలు మరెందులోనూ ఉండవు. అందుకే వీలైనన్ని ఫలాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఫ్రూట్స్ తీసుకోడానికి సరైన సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో తింటే వాటిలోని పోషకాలన్నీ శరీరానికి సరిగ్గా అందుతాయని తాజాగా ఓ పరిశోధనలో తేలింది.

 

సాధారణంగా చాలామంది టిఫిన్ తిన్న తర్వాత, మధ్యాహ్నం రాత్రి భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకోవడంలో తప్పేమీ లేదు కానీ ఆ సమయాల్లో కంటే ఉదయం పరగడుపునే పండ్లు తినడం చాలా మంచిదంటున్నారు నిపుణులు. మామూలుగానే పండ్లు త్వరగా అరిగిపోతాయి. పరగడుపునే అయితే ఆ అరుగుదల మరింత మెరుగ్గా ఉంటుంది. పైగా అప్పటికి ఏ ఇతర ఆహార పదార్థాలూ కడుపులోకి వెళ్లకపోవడం వల్ల ఫలాల పోషకాలు శరీరానికి అందండంలో ఎటువంటి అవరోధాలూ ఉండవట.

 

అయితే కడుపులో అల్సర్లు ఇతరత్రా సమస్యలు ఉన్నవారు, జీర్ణశక్తి తక్కువగా ఉన్నవాళ్లు పరగడుపున పండ్లు తీసుకోకూడదట. ముఖ్యంగా అనాస, ద్రాక్ష, నిమ్మ, నారింజ, టొమాటో వంటివి అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే వాటిలో ఉండే ఎసిటిక్ యాసిడ్ కారణంగా గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యి.. తద్వారా పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందట.

 

మీకు అలాంటి సమస్యలేమీ లేవా? అయితే భయపడక్కర్లేదు. రోజూ ఉదయాన్నే పరగడుపున పండ్లు తినండి. వాటిలోని పోషకాలను పూర్తిగా పొందండి.

- sameeranj