అద్భుతాలు సృష్టిస్తున్న 'Friendship Bench' ప్రాజెక్ట్

 

జింబాంబ్వే- ఈ పేరు వినగానే దుర్భర దారిద్ర్యం గుర్తుకువస్తుంది. కొన్నాళ్ల నుంచి జింబాంబ్వేలో ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదు, రాజకీయ పరిస్థితులూ అంతంతమాత్రమే! ఇదంతా ఆ దేశవాసుల మనసు మీద ప్రభావం చూపుతోంది. అంతర్యుద్ధాలతోను, నిరుద్యోగంతోనూ వారి మనసు చెదిరిపోతోంది. ఈ సమస్యలకి HIV లాంటి సమస్యలూ తోడవుతున్నాయి. ఇన్ని కష్టాలతో చెదిరిపోయిన మనసులలో, ధైర్యాన్ని నింపేందుకు తలపెట్టిన ప్రాజెక్టే - 'Friendship Bench' కార్యక్రమం.

 

ఎంతో అభివృద్ధి చెందిన దేశాలలో సైతం డిప్రెషన్తో బాధపడేవారు వైద్యుల దగ్గరకి వెళ్లేందుకు జంకుతారు. అలాంటిది జింబాంబ్వే సంగతి చెప్పాలా! ఒకవైపు సంప్రదాయబద్ధమైన ఆలోచనా విధానం, మరోవైపు వైద్యుని దగ్గరకు వెళ్లాలన్నా కూడా డబ్బు లేని దుస్థితి. ఒకవేళ ఎలాగొలా ధైర్యం చేసి వైద్యుడి దగ్గరకు వెళ్లాలనుకున్నా, అక్కడ తగిన వైద్యులే లేరయ్యే! కోటిన్నరకు పైగా జనాభా ఉన్న జింబాంబ్వేలో కేవలం 13 మంది సైకాలజిస్టులు మాత్రమే ఉన్నారట! జింబాంబ్వేలో మానసిక వైద్యులు లేకపోవచ్చు, కానీ మానసిక రోగులకి మాత్రం కొదవలేదు. ఒక అంచనా ప్రకారం జింబాంబ్వేలో దాదాపు నాలుగో వంతు మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. వీరిలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు లేదా జీవచ్ఛవాలుగా బతికేస్తున్నారు. దీనికి ఏదో ఒక పరిష్కరాన్ని కనుగొంది జింబాంబ్వే ప్రభుత్వం. అదే 'Friendship Bench' ప్రాజెక్ట్.

 

ఈ ప్రాజెక్టులో భాగంగా మానసిక సమస్యలతో ఆరోగ్య కేంద్రాల దగ్గరకు వెళ్లేవారికి కొన్ని ప్రశ్నలు ఉన్న పత్రం ఇస్తారు. దీన్ని Shona Symptom Questionnaire అంటారు. ‘మీకు సరిగా నిద్రపడుతోందా లేదా?’, ‘తరచూ ఆందోళనకు లోనవుతున్నారా?’ లాంటి ప్రశ్నలు ఇందులో ఉంటాయి. ఈ ప్రశ్నలకు రోగులు ఇచ్చే జవాబుల ఆధారంగా వారి మానసిక స్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సదరు రోగులలో తీవ్రమైన డిప్రెషన్తో బాధపడుతున్నట్లు తేలితే వారిని వారిని 'Friendship Bench'కి పంపిస్తారు.

 

ఫ్రెండ్షిప్ బెంచ్ అంటే మరేమీ లేదు. ఆరోగ్యకేంద్రాల బయట కొందరు పెద్దలు ఓ బెంచి మీద కూర్చుని ఉంటారు. వీరికి సహజంగానే బోలెడు జీవితానుభవం ఉంటుంది. దానికి తోడుగా, మానసిక సమస్యలు ఉన్నవారితో ఎలా ప్రవర్తించాలి? అన్న అంశం మీద శిక్షణ కూడా ఉంటుంది. వీరు చేసే పనల్లా... తమ దగ్గరకు వచ్చిన రోగుల సమస్యలను శ్రద్ధగా ఆలకించడం. అలా రోగుల సమస్యలను వింటూ, వారితో మాట్లాడుతూ... తమ సమస్యలకు తామే పరిష్కారం కనుగొనేలా ప్రోత్సహించడం. ఇలా ఒక ఆరు సెషన్లతోనే రోగులు తమ డిప్రెషన్ నుంచి కోలుకొంటున్నట్లు తేలింది.

 

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా... 'Friendship Bench' ప్రాజెక్టు అద్భుతమైన విజయం సాధించిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుల విజయాల మీద ఇటీవలే ఒక పరిశోధన కూడా జరిగింది. ఒక్కసారి 'Friendship Bench'లో చేరిన వారిలో డిప్రెషన్ నామరూపాలు లేకుండా పోయినట్లు ఈ పరిశోధనలో బయటపడింది. మరో విచిత్రం ఏమిటంటే... తమ డిప్రెషన్కు వైద్యుల దగ్గర చికిత్స తీసుకున్నవారికంటే, ఇలా 'Friendship Bench' ద్వారా మనసుకి సాంత్వన పొందినవారే డిప్రెషన్ నుంచి త్వరగా దూరమయ్యారట. దీనిబట్టి స్నేహితులతోనూ, జీవితానుభవం ఉన్న పెద్దలతోను మన సమస్యలను పంచుకుంటే... మనసు ఎంతో తేలికపడుతుందని తెలిసిపోయింది కదా!


(స్నేహితుల దినోత్సవం సందర్భంగా)

- నిర్జర.