మాలీపై బాంబుల వర్షం! 50 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతం?

posted on: Nov 3, 2020 11:30AM

సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ భీకరంగా విరుచుకుపడింది. ఉగ్రవాదుల స్థావరాలపై  ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో  50 మంది వరకు అల్ ఖైదాకు చెందిన జీహాదీలు హతమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం  అధికారికంగా ప్రకటించింది. బుర్కినా ఫాసో, నైగర్ సరిహద్దుల్లో వేచివున్న ప్రభుత్వ దళాలు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు వీలును కల్పించేందుకు ఈ దాడులు చేసినట్టు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ  తెలిపారు. మాలీలో ఉన్న  బర్కానే దళాలతో కలిసి ఈ దాడులు చేశామని, ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని  ఫ్రాన్స్ మంత్రి ప్రకటించారు. 

 

మూడు దేశాల సరిహద్దుల్లో భారీ ఎత్తున మోటార్ సైకిల్ కారావాన్ సాగుతోందని తమ డ్రోన్లు గుర్తించిన తరువాత, విమానాలు వెళ్లి దాడులు చేశాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దాడుల నుంచి తప్పించుకోవాలని ఉగ్రవాదులు చెట్లు తదితరాల చాటుకు వెళ్లారని, ఈ దాడుల్లో రెండు మిరేజ్ జెట్లు, ఓ డ్రోన్ ను పంపి, మిసైల్స్ ను జారవిడిచామని పార్లీ తెలియజేశారు. ఈ దాడుల తరువాత నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు సైనిక అధికారి కల్నర్ ఫ్రెడ్రిక్ బార్బరీ తెలియజేశారు. దాడులు జరిగిన ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు, ఆత్మాహుడి దాడికి వినియోగించే దుస్తులు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫ్రెడ్రిక్ తెలిపారు. 

 

నైగర్ అధ్యక్షుడు మహమదౌ ఇసోఫౌవుతో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ  సమావేశం జరిగిన గంటల వ్యవధి తరువాత ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేటర్ సహారా ప్రాంతంలోనూ ఆర్మీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులను తుదముట్టించేందుకు 3 వేల మందికి పైగా ఫ్రాన్స్  సైన్యం రంగంలోది దిగిందని చెబుతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...