నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు ప్రారంభం

 

  

 

 

 తిరుపతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్,, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా ప్రముఖ గాయనిలు సుశీల, రావు బాలసరస్వతి మాతెలుగు తల్లి పాటను పాడగా, తెలుగు భాషపై ప్రత్యేకంగా రచించిన, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను సభలో వినిపించారు. ఆనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రత్యక్షంగా పాడలేకపోతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మరోవైపు తెలుగు మహాసభల సందర్భంగా తిరుపతిలో తెలుగుదనం ఉట్టిపడుతోంది. కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలలో సందడి నెలకొంది. కొన వూపిరితో ఉన్న తెలుగు బాషకు పూర్వ వైభవం కల్పించడమే ఈ మహాసభల అసలు లక్ష్యం.

 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగును ‘అధికార బాష’ గా నిలబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా చర్చిస్తారు. తెలుగు బాషకు చెందిన భాషా వేత్తలు, పలు రంగాల ప్రముఖులు ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే అంశంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే వేదికగా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. సాహిత్యం, లలిత కళలు, సంగీత రంగాలకు ప్రత్యేకంగా అకాడమీలను ఏర్పాటు చేసే విషయం గురించి కూడా ముఖ్య మంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

 

గ్రామ, మండల, జిల్లా,రాష్ర స్థాయిల్లో క్రమంగా తెలుగు బాషను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు సమాచారం. ఈ అంశంఫై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా పుణ్య క్షేత్రం తిరుపతి లో తెలుగు వైభవం ఉట్టి పడుతోంది. దీనిని పురస్కరించుకొని తిరుపతి నగర పాలక సంస్థ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సభా ప్రాంగణంలో ఐదు ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఈ ఐదు వేదికల్లో సాహిత్యం, జానపదం, రంగ స్థలం, సంగీతం, నృత్యం రంగాలకు సంభందించిన కార్యక్రమాలు జరుగుతాయి.

 

ఈ సభల సందర్భంగా, అధికార బాషా సదస్సు, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారు, సాహిత్య వేదిక, చరిత్ర, లలితా కళలు, ప్రగతి రంగం వంటి అంశాల్లో చర్చలు జరుగుతాయి. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ సభలకు సుమారు 40 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే, తిరుపతి నగరంలో ఆసక్తి ఉన్నవారంతా ఈ సభలకు హాజరయ్యేందుకు కూడా అవకాశం కల్పించారు.

 

ఈ సందర్భంగా రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 14 మంది తెలుగు ప్రముఖులకు సన్మానం జరగనుంది. డాక్టర్ సి.నారాయణరెడ్డి (సాహిత్యం), సిఆర్.రావు (శాస్త్రం), యామినీ కృష్ణమూర్తి (నృత్యం), అక్కినేని నాగేశ్వరరావు (చలనచిత్రం), ఆచంట వెంకటరత్నంనాయుడు (నాటకం), చుక్కా సత్తయ్య (జానపదం), బాపు (కళలు), ఎస్వీ రామారావు (చిత్రకళ), ముఖేష్ (క్రీడలు), అజారుద్దీన్ (క్రీడలు)లతోపాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులు చివుకుల ఉపేంద్ర (న్యూజెర్సీ), గుజ్జుల రవీంద్ర (జర్మనీ), ఎం. శ్రీనివాసరెడ్డి (శాస్త్రవేత్త, అమెరికా), భాట్టం శ్రీరామమూర్తిలు ఈ జాబితాలో ఉన్నారు.

 

మొదటి ప్రపంచ తెలుగు మహా సభలు 1975 లో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో అప్పటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగాయి. ఇక మిగిలిన రెండు సభలు విదేశాల్లోనే జరిగాయి. రెండవ సభలు 1981 ఏప్రిల్ లో మలేషియాలో ఐదు రోజుల పాటు జరిగాయి. మూడో ప్రపంచ తెలుగు మహా సభలు 1990లో మారిషస్ లో జరిగాయి. ఈ సభల కోసం ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏడుగురు ఎస్ పి స్థాయి అధికారుల పర్యవేక్షణలో మొత్తం ఆరు వేల మంది పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.