Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పుంగనూరు పుడింగి కబ్జా కహానీ.. ఫైళ్ల దగ్ధం అందుకేనా?
posted on: Jan 30, 2025 6:21AM
.webp)
మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాల పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. అటవీ భూముల్లో విలాసవంతమైన ఫాంహౌస్ కట్టుకొని, దాదాపు వంద ఎకరాల భూమిని ఆయన కబ్జా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అయితే, ఆర్నెళ్ల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్దం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణలో పైళ్ల దగ్దం ప్రమాదశాత్తూ జరగలేదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టారని తేలింది. ఆ ఫైళ్లకు నిప్పుపెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచరులే అని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది. ప్రస్తుతం పెద్దిరెడ్డి కబ్జాల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో ఆ ఫైళ్ల దగ్దానికి, అటవీ భూముల్లో ఆక్రమణలకు సంబంధించిన రికార్డులకు సంబంధం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పెద్దిరెడ్డి అటవీ భూముల్లో పెద్ద ఫాంహౌస్ కట్టుకోవటం, దానికి రోడ్డు కూడా వేయించుకోవటం పెద్ద చర్చనీయాంగా మారింది.
పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని గ్రామానికి చాలా దూరంగా దట్టమైన అడవిలో సుమారు వంద ఎకరాల భూమిని పెద్దరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి విలాసవంతమైన ఫాంహౌస్ కట్టుకున్నారు. దానికి తారు రోడ్డు కూడా వేయించారు. విద్యుత్ లైన్ కూడా ఉంది. ఆ దారిలో వెళితే వందల మామిడి చెట్లు, పశువుల కోసం నిర్మించిన భారీ షెడ్లు, పదుల ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. అంతే కాదు.. ఆ భూమి చుట్టూ పెద్ద ఇనుప కంచెను సైతం ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద రికార్డుల్లో రెండు సర్వే నెంబర్లలో 17.69 ఎకరాల భూమి ఉన్నట్లు ఉంది. అడవి మధ్యలో పట్టా భూమి ఉండటమే చాలా అరుదు. అయితే, రానురాను అ భూమి అమాంతం పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఆయన కుటుంబీకుల పేరుపై అక్కడ సుమారు వంద ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భూమి ఎలా వచ్చింది అనేది చర్చనీయాంశంగా మారింది.
దట్టమైన అటవీ భూమిలో పెద్దిరెడ్డికి ఫామ్ హౌస్, సుమారు వంద ఎకరాల భూమి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ భూములు ఆక్రమించినవారిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని ఆదేశించారు. పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్)తో పవన్ కల్యాణ్ మాట్లాడి.. పెద్దిరెడ్డి భూముల వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించారు. అక్కడఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా.. చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు.. తద్వారా లబ్ధి పొందింది ఎవరనేది నివేదికలో పేర్కొనాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. దీనికి తోడు అటవీ భూముల రక్షణపై పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటైంది. ఈ జాయింట్ కమిటీలో చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం కన్జెర్వేటర్ ఆఫ్ ఫారెస్టు అధికారులు సభ్యులుగా ఉంటారు. ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో రెవెన్యూ అధికారులు ఆ భూమిని సర్వే చేశారని, దీనికి సంబంధించి గతంలో ఫారెస్ట్ గెజిట్ కూడా విడుదలైందని, ఇది పబ్లిక్ డొమైన్ లోనే ఉంటుందని, ఎవరైనా చూసుకోవచ్చని అన్నారు. ఇక రోడ్డు విషయానికి వస్తే.. గతంలో అది బండ్లు పోయేందుకు వీలుగా ఉందని, అయితే దాన్ని పక్కా రోడ్డుగా మార్చేందుకు తాము దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఆ రోడ్డు వేస్తే ఇతర రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్న ఉద్దేశంతో అటవీశాఖ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని పెద్దిరెడ్డి వివరించారు. తారు రోడ్డు వేసుకోవచ్చని 2022లో అనుమతి వచ్చిందని వెల్లడించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆరోజు ఫారెస్ట్, రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి ఆక్రమణ లేదు అని తేల్చి చెప్పిందని పెద్దిరెడ్డి తెలిపారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్న అటవీ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి వేల ఎకరాల పేద ప్రజల భూములు, అటవీ భూములు అటవీ సంపదను దోచుకున్నారన్నారని విమర్శించారు. పెద్దిరెడ్డి ఆయన కుమారుడు గతంలో చేసిన అక్రమాలు అన్యాయాలకు అంతూ పొంతూ లేదనీ ఇప్పుడు వాటిని బయటకు తీసే సమయం వచ్చిందన్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, తిరుపతిలో ఎక్కడ చూసినా వేలాది ఎకరాల భూమిని దొంగ రికార్డులు సృష్టించి కబ్జా చేశారని మంత్రి ఆరోపించారు. మరో వైపు పలువురు తెలుగుదేశం నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెద్దిరెడ్డిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అధికారులు నివేదికలో పెద్దిరెడ్డి అటవీ భూమిని కబ్జా చేశారని తేలితే ఆయన జైలుకెళ్లడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.


.webp)



