ఆనం వ‌ర్సెస్ అనిల్.. నెల్లూరులో ఫ్లెక్సీ వార్‌..

posted on: Apr 19, 2022 11:03AM

ఏపీ సీఎం ఏ ముహూర్తంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టారో గానీ.. ఆ రోజు నుంచీ నెల్లూరు జిల్లాలో వైసీపీలో రచ్చ మొదలైంది. జిల్లాలోని వైసీపీ నేతలు ఒకే రోజు ఒకే సమయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించే దాకా విభేదాలు బహిర్గతం అయ్యాయి. ఇటీవలి కేబినెట్ లో కొనసాగింపు లేకుండా మాజీగా మారిన అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ మంత్రి అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి- ఆనం రామనారాయణరెడ్డిగా ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయంటున్నారు. ఈ విభేదాలు ఎక్కడి దాకా వెళ్లాయంటే.. నగరంలో వేస్తున్న వైసీపీ నేతల ఫ్లెక్సీలను చింపి పారేసే దాకా సమస్య వెళ్లింది. దీంతో నెల్లూరు నగరంలో గత కొద్ది రోజులుగా  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కొద్ది రోజుల క్రితం మంత్రి పదవి చేపట్టిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా నెల్లూరు జిల్లాకు వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగతం ప్లెక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చింపి పారేశారు. మంత్రి కాకాని, మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పోటోలతో ఉన్న  ఫ్లెక్సీలు నెల్లూరు నగరం అంతా ఏర్పాటు చేశారు. అయితే.. వాటిని తొలగించడం వెనుక తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రోద్బలం ఉందంటూ ఆనం, కాకాని వర్గీయులు బహిరంగంగానే ఆరోపించారు. అనిల్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

ఇలా ఉండగా.. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బర్త్ సందర్భంగా నెల్లూరు నగరంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి ఎవరో చింపేశారు. మంగళవారం నాడు ప్రభాకర్ రెడ్డి బర్త్డే. అయితే.. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపేసినట్లు చెబుతున్నా.. ఈ చర్య వెనుక కూడా అనిల్ కుమార్ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను మంగళవారం మళ్లీ ఏర్పాటు చేశారు.

ఒకటే పార్టీలో ఉంటున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలను చింపేస్తుండడం గర్హనీయమని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. నెల్లూరు నాయకుడి ప్రోద్బలంతోనే కొందరు పోకిరీలు ఇలా ఫ్లెక్సీలను చింపేస్తున్నారని భయపడుతున్నారు. కొందరు పోకిరీల కారణంగా నెల్లూరు నగరంలో ముందు ముందు దారుణమైన పరిస్థితితులు చూడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటితో ఈ దుశ్చర్యలను ఆపకపోతే ఇలాంటి దురాగతాలు జిల్లా మొత్తం చుట్టుకునే ప్రమాదం ఉందని వారు ఆవేదన చెందుతున్నారు.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...