'సీతమ్మ వాకిట్లో..' నాయక్ రామ్ చరణ్

 

ఇంచుమించుగా ఒకేసారి విడుదలయిన రెండు సినిమాలు 'నాయక్' మరియు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినీ విశ్లేషకుల నుంచి మంచి రేటింగ్స్ రాబట్టుకోవడమే గాకుండా, ప్రేక్షకుల మెప్పును కూడా పొందగలిగేయి. ఒకటి మాస్ ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఆకట్టుకొంటే, రెండోది వారితో బాటు ఫ్యామిలీ ఆడియన్సును కూడా ఆకట్టుకొంది. మొత్తం మీద కొత్త సం.లో విడుదలయిన రెండు పెద్ద చిత్రాలు కూడా చిత్రసీమకి మంచి బోణీ ఇచ్చిఅందరికీ మంచి ఉత్సాహం కలిగించేయి.

 

ఇక, నాయక్ సినిమా పక్కా కమర్షియల్ సినిమా అయినప్పటికీ, అందులో దర్శకుడు వినాయక్ స్క్రీన్ ప్లేలో చూపిన మంచి పనితనం, తనదయిన శైలిలో జోడించిన మంచి కామెడీ ట్రాక్, రామ్ చరణ్ చేత చేయించిన ఫైట్స్, డాన్స్ లు, పేల్చిన పంచ్ డైలాగులు, ఇద్దరు హీరోయిన్ల  అందాలు అన్నీ ఆ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచేయి. దర్శకుడు వీ.వీ.వినాయక్, రామ్ చరణ్ చేత మొట్ట మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేయించి, అభిమానులను దియేటర్లవైపు రప్పించుకొన్నాడు. తెలుగు సినిమా పరిశ్రమ మొదలయినప్పటినుండి చూస్తున్న ద్విపాత్రబినయం సినిమాని, మరోమారు కూడా ఎక్కడా బోరుకొట్టకుండా చక్కగా చూపించి, అవసరమయితే మరో వందసార్లు కూడా తీసుకోవచ్చుననే భరోసా ఇచ్చేడు దర్శకుడు.

 

ఇక, సీతమ్మ వాకిట్లోకి వస్తే మనమందరం కలలుగనే ఒక అద్భుతమయిన స్వంత కుటుంబములోకి వచ్చినట్లు ఉంటుంది. అటువంటి ఆప్యాయతలు,కుటుంబ విలువలు, సంప్రదాయాలు చూసి ఎంత కాలమయియింది అనిపిస్తుంది. సినిమాలో నటించిన అందరూ కూడా ఎక్కడా అతిలేకుండా నటించడంతో సినిమా బాగా పండింది. ఎంచుకొన్న కధాంశం అందరికీ తెలిసిందే అయినప్పటికీ దానిని దర్శకుడు మనసులకు హత్తుకునేలా వెండి తెరమీద ఆవిష్కరించడంతో సినిమా అందరి మెప్పు పొందింది.

 

సినిమాలో ప్రతీ ఒక్కరు అద్బుతంగా నటించినప్పటికీ, మహేష్ బాబు చేసిన చిలిపిఅల్లరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకొందని చెప్పవచ్చును. ప్రేక్షకులకోసం తన సినిమాలలో నిత్యం రక్తం ఓడ్చేమహేష్ బాబు, ఈ విదంగా కనిపించడం అందరినీ ఆకట్టుకొంది.వెంకటేష్, ప్రకాష్ రాజ్, సమంత, అంజలి అందరూ కూడా ఎవరి పాత్రలలో వారు చక్కగా ఒదిగిపోయి సినిమాలో వారు కాక వారి పాత్రలే కనిపించేలా నటించేరు.

 

ఇక, రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాను ఒంటి చేత్తో విజయం వైపు నడిపిస్తే, సీతమ్మ వాకిట్లో కలుసున్న ప్రతీ ఒక్కరూ దాని విజయంలో భాగస్వాములే.

 

నాయక్ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రబినయం చేసినప్పటికీ, ఒక్కడే ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేస్తే, సీతమ్మ వాకిట్లో రెండు జంటలు సినిమాని నడిపించాయి.

 

 

నాయకుడు జనాన్ని రఫ్ ఆడించేసి హృదయాలు గెలుచుకొంటే, సీతమ్మ కుటుంబ సభ్యులు పండుగ రోజున ప్రేక్షకులకు మంచి కమ్మటి భోజనం పెట్టి ప్రశంసలు అందుకొన్నారు.

 

ఒకటి మాస్ మరొకటి క్లాసు అయిన రెండూ రెండే! తెలుగు ప్రజలు రెంటినీ ఎప్పటికీ ఆదరిస్తారని ఈ రెండు సినిమాలు మరో మారు నిరూపించేయి.

 

నాయక్ సినిమా స్క్రీన్ ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్, సాంకేతికత మీద ఆధారపడితే, సీతమ్మ చక్కటి , కధాంశం, తారల నటన, తెలుగుతనం మీద రాణించింది.

 

ఇది వరకు ఎన్నడు లేని విదంగా, ఈ రెండు సినిమాలపై ట్వీట్టర్, ఫేస్ బుక్ వంటి సామాజిక వెబ్ సైట్లలో యువత చాలా లోతుగా ఆసక్తిగా చర్చలు చేయడం వాటిపై వారికున్న అంచనాలకు ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సినిమాలు షూటింగ్ మొదలయిన మొదటి రోజునుండే మొదలయిన ఈ చర్చలు నేటికీ సాగడం మరో విశేషం. అదే విదంగా దర్శకులిద్దరూ కూడా సినిమా మొదలు పెట్టగానే సినిమా గురించి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేయడం మరింత చర్చకు అవకాశం ఇచ్చింది.

 

దర్శకుడు (వి)నాయక్ సినిమా మొదలు పెట్టిన మొదటి వారంలోనే ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలచేసి అభిమానులలో అంచనాలు పెంచగా, సీతమ్మ వాకిలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు పేరును తన ఫ్యామిలీ సినిమాకు జోడించి అందరిలో ఆసక్తి రేపాడు. ఇద్దరు దర్శకులు అభిమానులు ఊహించినట్లే వారి అంచనాలను అందుకొని పండుగ సమయంలో ప్రేక్షకులకు మంచి విందు చేసారు.