సాఫ్ట్‌వేర్ వీకెండ్ బిర్యానీ పార్టీలు..లివర్ సమస్యలకు కారణమా?

Publish Date:Apr 21, 2016

బిర్యానీ ఈ మాట వింటే చాలు నోరూరిపోవటమే కాదు. ఎప్పుడెప్పుడు తిందామా అంటూ ఎదురుచూస్తుంటారు భోజన ప్రియులు. బిర్యానీలో చాలా రకాల వెరైటీలున్నాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా రకరకాల బిర్యానీలు మనకు విందుచేస్తాయి. వారంలో ఒక్కసారైనా బిర్యానీ తినకపోతే ఏం బాగుంటుందని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇక మీదట ఇలా చెప్పుకోవాలంటేనే భయపడే రోజులు రాబోతున్నాయి. ఇటీవల చేసిన పరిశోధనల్లో తేలిన విషయం ఏంటంటే బిర్యానీలు లివర్‌ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయంట. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కాలేయం పాడువుతుందని అందరికీ తెలిసిందే..అయితే ఆల్కహాల్ తీసుకోకపోయినా కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా కాలేయం చిక్కుల్లో పడుతుందని లేటేస్ట్ న్యూస్.

 

ఫ్యాటీ లివర్ అనే వ్యాధి గురించి చాలా మందికి తెలుసు. బాహ్యంగా కనిపించే మన శరీరమే కాదు..దాని లోపలున్న అవయవాలు కూడా లావెక్కుతాయని ..! నిజానికి ఊబకాయానికి దారి తీసే కొవ్వులో చాలా వరకు పొట్టలో పేగుల మధ్యలో కూడా పేరుకుపోయి ఉంటుంది. ఇదే కొవ్వు కాలేయంలో కూడా చేరితే..అదీ లావెక్కిపోయి, పనిచేయడానికి మొరాయిస్తుంది. దాని ఫలితమే ఫ్యాటీ లివర్..ఇది రెండు రకాలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఫ్యాటీ లివర్ అని ఇది రెండు రకాలు. వీటిలో ఎక్కువ మందిని బాధించేది దీర్ఘకాలిక ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ సమస్య మొదట నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌గా ప్రారంభమై, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌గా మారుతుంది. దీనిని ఇంకా నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్‌గా మారి కాలేయం పూర్తిగా దెబ్బతిని ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది.

 

ఆధునిక జీవన శైలి, ఉరుకుల పరుగుల జీవితాలు, టైంకి తినకపోవడం తదితర కారణాలతో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ఐటీ. ఐటీ అనుబంధ రంగాల్లో పనిచేసే వారు దీని ప్రభావానికి గురవుతున్నారు. కదలకుండా పనిచేయడం వల్ల టెక్కీల్లో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. ఐటీ ఉద్యోగులు వారానికి కనీసం నాలుగైదు సార్లు బిర్యానీని టేస్ట్ చేస్తారని అంచనా..దానితో పాటు ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్, బర్గర్స్ లాంటి హై క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవడం దానికి తగ్గట్టు తగినంత వ్యాయామం చేయకపోవడం వల్ల కొవ్వు పెరుకుపోయి ఫ్యాటీ లివర్‌కు కారణమవుతోందని గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఫ్యాటీ లివర్‌కి ప్రత్యేకించి ఒక మందు అంటూ అందుబాటులో లేదు. కాబట్టి దీనికి మొట్టమొదటి చికిత్స బరువు తగ్గడమేనని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు హైపోకెలోరిక్ డైట్ పాటించాలి. సో బిర్యానీలు, స్వీట్స్, బర్గర్లు లాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఆరోగ్యం కావాలంటే తప్పదు మరి.

 

By
en-us Life Style News -