గాంధీగారి మేకపాలు కథ

మహాత్మాగాంధి సిద్ధాంతాలతో కొందరు అంగీకరించవచ్చు, లేదా విభేదించనూవచ్చు. కానీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్రని ఎవరూ కొట్టిపారేయలేరు. అహింసని సైతం ఒక ఆయుధంగా మార్చిన తీరుని మర్చిపోనూలేరు. తను ఏర్పరుచుకున్న నియమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే గాంధీగారిని మిగతావారికంటే భిన్నంగా నిలిపిందన్నది వాస్తవం. అది సత్యాగ్రహం కావచ్చు, అహింసా సిద్ధాంతం కావచ్చు. ఆయన జీవనశైలిని గమనిస్తే ఇలాంటి నియమాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో ఒకటి మేకపాలు తాగడం! ఎవరు ఎగతాళి చేసినా కూడా గాంధీగారు మేకపాలు మానేవారు కాదు. ఇంతకీ గాంధీగారు మేకపాలు తాగడం వెనుకనున్న కథ ఏమిటో, అసలు మేకపాలంటే కొందరికి ఎందుకంత అభిమానమో చూద్దాం...

 

మాటకు కట్టుబడి!
గాంధీ ఒకప్పుడు పూర్తిగా శాకాహారానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఇతర జంతువుల నుంచి వచ్చే పాలని కూడా ఆయన ముట్టుకోవడం మానేశారు. ఇలా ఒక ఆరేళ్లపాటు పాలకి దూరంగా ఉన్నారు కూడా! అయితే 1917లో ఆయనకు తీవ్రమైన అతిసార వ్యాధి పట్టుకుంది. మనిషి నీరసంతో కృశించిపోయాడు. అలాంటి స్థితిలో పాలు చాలా మేలు చేస్తాయని అందరూ సూచించినా, తన పాత నిర్ణయానికి కట్టుబడి ఆయన పాలని ముట్టుకోలేదు.

 

ఒక ఐడియా!
గాంధీగారి పరిస్థితి చూసిన ఒక వైద్యుడు ఓ ఉపాయాన్ని సూచించాడు. ‘మీరు పాలని ముట్టుకోను అని నిర్ణయించుకున్నప్పుడు మీ మనసులో ఆవు లేదా గేదె పాలే మెదిలి ఉంటాయి కదా! అలంటప్పుడు మీ మాటని కాస్త సడలించి మేక పాలుని తీసుకోవచ్చు కదా!’ అన్నాడు. దీన్ని గాంధీగారి భార్య కస్తూరిబాయి కూడా సమర్థించడంతో, అప్పటి నుంచీ ఆయన మేకపాలని తీసుకోవడం మొదలుపెట్టారు.

 

నిజానికి గాంధీగారి దృష్టిలో పాలు అంత ఆరోగ్యకరం కాదు. వాటిద్వారా సదరు జంతువులలో ఉండే రోగకారకాలన్నీ మనకు అంటుకుంటాయని ఆయన అభిప్రాయం. అయితే శాకాహారులకు పూర్తిస్థాయి పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో గత్యంతరం లేదని ఆయన తరువాత రోజుల్లో ఒప్పుకొనేవారు.

 

మేకపాలు ప్రత్యేకమేనా!
గాంధీగారు మేకపాలు తాగడం మాట అటుంచి, చాలామంది నిపుణులు గేదెపాలకంటే మేకపాలు శ్రేష్టమని వాదిస్తున్నారు. వారి వాదనల ప్రకారం మేకపాలలో చాలా సుగుణాలే ఉన్నాయి.
 

- ఆవు/గేదెపాలకంటే మేకపాలలోని కొవ్వుకణాలు చిన్నగా ఉంటాయట. అందుకని ఇవి మిగతా పాలకంటే సులభంగా జీర్ణమవుతాయి.
 

- కొందరికి పాలు సరిపడవు. కారణం! వాటిలో ఉండే లాక్టోజ్‌ అనే పదార్థం. మేకపాలలో లాక్టోజ్‌ చాలా తక్కువ స్థాయిలో ఉండి పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కేవలం లాక్టోజే కాదు. పాలల్లో ఉండే ‘A1 కేసిన్‌’ అనే మాంసకృత్తుల వల్ల చాలామందికి జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అయితే మేకపాలలో ‘A1 కేసిన్‌’ బదులు ‘A2 కేసిన్‌’ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జీర్ణసంబంధమైన ఇబ్బందులు దరిచేరవు.
 

- గేదెపాలకంటే మేకపాలలోనే ఎక్కువశాతం ఖనిజాలు లభిస్తాయి. ఇక విటమిన్లు, కొవ్వు సంగతి చెప్పనే అక్కర్లేదు. మేకపాలు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతాయంటున్నారు నిపుణులు.
 

- మేకపాలలో ఎక్కువ పోషకాలు ఉండటమే కాదు. ఇతర పాలతో పోలిస్తే ఈ పోషకాలని మన శరీరం మరింత సులువుగా గ్రహించగలదట.
 

- మేకపాలలో విటమిన్‌ A ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి కాంతినీ, మృదుత్వాన్నీ తీసుకువస్తుందట. పైగా చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా నివారించే శక్తి దీనికి ఉంది. అందుకనే కొంతమంది మేకపాలని చర్మానికి నేరుగా రాసుకుంటారు. మేకపాలతో చేసిన సబ్బులకు కూడా మంచి ఆదరణ ఉంది.
 

- శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సెలేనియం అనే ఖనిజం మేకపాలలో ఎక్కువగా ఉంటుంది. జుట్టు మొదలుకొని థైరాయిడ్ వరకూ ఈ సెలేనియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట.

ఇలా ఒకదాని తరువాత ఒకటిగా మేకపాల ప్రత్యేకతలు చాలానే కనిపిస్తాయి. గాంధీగారు చెప్పారని కాదు కానీ ఇప్పటికీ చాలామంది మేకపాలను మిగతా పాలతో సమానమైన విలువ కలిగనివా భావిస్తారు. ఇంత చదివిన తరువాత మేకపాల గురించి ఎలా ఎగతాళి చేయగలం!

 

- నిర్జర.