TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సెల్‌టవరెక్కిన రైతన్న

Published on: Sun Sep 23, 2012 5:20PM

అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్ళిచేయమని అడగటానికో, కాలేజీ యాజమాన్యం హాల్‌టికెట్‌ ఇవ్వలేదనో, పైస్థాయి అధికారులు తనను వేధిస్తున్నారనో... సెల్‌టవర్‌ ఎక్కలేదు... పదిమంది కడుపునింపడం కోసం తనపొలం సాగుకోసం కావలసిన ధనసాయం కోసం తిరిగి తిరిగి, విసిగివేసారి సెల్‌టవర్‌ ఎక్కాడు. కాలవైపరీత్యమంటే ఇదే! ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం పోలంపల్లికి చెందిన ధారావత్‌ వీరన్న అనే రైతు రెండునెలలుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా పంట రుణం ఇవ్వడంలేదని సెల్‌ టవర్‌ ఎక్కి తన నిరసనను తెలియజేశాడు. కారేపల్లి బ్యాంకు మేనేజర్‌ రుణాలు ఇవ్వడానికి నిరాకరించడంతో జెసీకి ఫిర్యాదు చేయడంతో రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు జేసి సూచించారు. అయినా మేనేజర్‌ స్పందించకపోవడంతో రైతన్న వీరన్న సెల్‌ టవర్‌ ఎక్కడ తప్పిందికాదు. వీరన్నకు మద్దతుగా అఖి పక్షం రాస్తారోకో చేయడం తదితర పరిణామాల తర్వాత అర్హులైన రైతులందరికి వారంరోజుల్లో రుణాలిస్తామని మేనేజర్‌ హామీ ఇచ్చారు.


చివరకు రైతన్న కూడా రోడెక్కక తప్పిందికాదు. గుడిలో పూజారి, బడిలో ఉపాధ్యాయుడు, అన్నదాత రైతన్నలు సైతం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. తమ పనేదో తాముచేసుకునే వీరంతా ఇలా రోడెక్కె పరిస్థితులు రావడానికి   నేతల రాజకీయాలు, కొందరు అధికారుల నిర్లక్ష్యం, తాము ఏం చేసినా అడిగేవారు లేరన్న ధీమా, రాజకీయనేతల పలుకుబడి తదితరాలు కారణమని చెప్పాలి. రైతులకు పంటకోసం తీసుకునే రుణంమొదలు, విత్తనాలు, ఎరువులు...ఇలా చేతికొచ్చిన పంట గిట్టుబాటుధరకు అమ్ముకునేవరకు కూడా రోడ్డెక్కె పరిస్థితులు వచ్చాయి. విదేశీ పెట్టుబడులు కూడా ప్రవేశించాయంటే ఇక ‘దొర.. దండాలు’అనే స్థాయికి దిగజారిపోతుందేమోనని నేటి పరిస్థితులను చూస్తున్న సామాన్యులు రైతన్న దుస్థితిపై  సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.