ఆడదిక్కు లేని సంసారం... ఆరోగ్యానికీ నష్టమే!

Publish Date:Dec 6, 2016


పిల్లల్ని పెంచడంలో ఇప్పటికీ ఆడవారే కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే! అందుకనే విడాకులు తీసుకున్నప్పుడు కూడా పిల్లల బాధ్యతలని ఆడవారే స్వీకరిస్తూ ఉంటారు. ఒకవేళ మగవారు కనుక పిల్లల బాధ్యతలని భుజాన వేసుకుంటే వారి పరిస్థితి ఏంటి? అన్న ఆలోచన వచ్చింది మారియా అనే పరిశోధకురాలికి. ఆలోచన వచ్చిందే తడవుగా ఒంటరి తల్లులతో పోలిస్తే ఒంటరి తండ్రుల ఆరోగ్యం ఏ తీరున ఉందో గమనించే ప్రయత్నం చేసింది.

 

ఒంటరి తండ్రులు పెరుగుతున్నారు

సమాజంలో చెదిరిపోతున్న వైవాహిక బంధాల వల్ల ఒంటరిగా పిల్లల్ని పెంచే తండ్రుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే వీరి కష్టం మీద ఇప్పటివరకూ పెద్దగా పరిశోధనలు జరగలేదంటున్నారు మారియా. ఇందుకోసం ఆమె కెనడాకి చెందిన 1,058 మంది ఒంటరి తండ్రుల స్థితిగతులను గమనించారు. ఆ గణాంకాలను 20 వేల మంది సాధారణ తండ్రులతోనూ, 5,725 ఒంటరి తల్లులతోనూ పోల్చి చూశారు.

 

స్పష్టమైన తేడాలు

ఇంట్లో ఆడదిక్కు ఉన్నవారితో పోలిస్తే ఒంటరి తండ్రుల ఆరోగ్యం అంతంతమాత్రమే అని తేలింది. పైగా వీరిలో మానసిక సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఒంటరిగా పిల్లల్ని పెంచుకొస్తున్న తల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయితే వారితో పోలిస్తే సగానికి సగం మంది ఒంటరి తండ్రులు మాత్రమే తమ మానసిక సమస్యలకు పరిష్కారం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్నారట.

 

మూడు కారణాలు

ఒంటరి తండ్రులలో ఈ అవస్థకి మూడు కారణాలను పేర్కొనవచ్చునంటున్నారు పరిశోధకులు..

 

- తాము మానసికంగా క్రుంగిపోతున్నామని ఒప్పుకొంటూ, వైద్యులు సలహాని తీసుకునేందుకు మగవారు సంశయించడం.

 

- సమాజం కూడా ఒంటరి తల్లుల మీద చూపే జాలి, శ్రద్ధా ఒంటరి తండ్రుల మీద చూపకపోవడం.

 

- ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్ల వారి ఆరోగ్యాన్ని పట్టించుకునేందుకు కానీ, మంచిచెడులు చెప్పేందుకు కానీ, అండగా నిలిచేందుకు కానీ ఓ తోడు లేకపోవడం.

 

ఒంటరి తండ్రులు కనుక మానసిక వ్యధకి లోనవుతుంటే.. ఆ ప్రభావం పిల్లల మీద పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాబట్టి, ఏవన్నా మనస్పర్థలు వస్తే సామరస్యంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి కానీ, పిల్లల్ని పంచుకుని పెంచుకునే దాకా పోకూడదని ఈ పరిశోధన సూచిస్తోంది. ఒకవేళ అలాంటి పరిస్థితే కనుక ఏర్పడితే... సదరు వ్యక్తిని కనిపెట్టుకుంటూ ఉండాలని సమాజాన్ని కూడా హెచ్చరిస్తోంది.

 

- నిర్జర.

By
en-us Health News -