బలవంతపు నవ్వుతో ఉపయోగం లేదు

 

‘మీరు సంతోషంగా లేకపోతే ఓ ఉపాయం ఉంది. మొహం మీద బలవంతంగా చిరునవ్వుని పులుముకోండి. దాంతో సంతోషం దానికదే తన్నుకుంటే వచ్చేస్తుంది. మీ దృక్పధమే మారిపోతుంది,’ అంటూ ఇన్నాళ్లుగా సైకాలజిస్టులు, వ్యక్తిత్వ వికాస నిపుణులూ ఊదరగొట్టేవారు. కానీ ఈ సూత్రంలో నిజం లేదని తాజా పరిశోధన రుజువు చేస్తోంది.

 

30 ఏళ్ల నమ్మకం

ఒక మనిషి బలవంతంగా నవ్వుతూ ఉంటే, అతని మనసు కూడా తెలియకుండానే మారిపోతుందా! అన్న సందేహం జర్మనీ చెందిన ‘స్ట్రాక్‌’ అనే పరిశోధకుడికి వచ్చింది. దాంతో ఆయన 1988లో ఒక పరిశోధన చేశారు. కొంతమందిని లేని నవ్వుని తెచ్చిపెట్టుకొని ఎదురుగా ఉన్న కార్టూన్లను చూడమని చెప్పారు. ఇలా బలవంతపు నవ్వుతో కార్టూన్లని చూసిన తరువాత, అవి ఏ మేరకు నవ్వు తెప్పించేవిలా ఉన్నాయో మార్కులు వేయమన్నారు. మొహంలో ఎలాంటి నవ్వూ లేనివారితో పోలిస్తే బలవంతపు నవ్వుతో కార్టూన్లను చూసిన వ్యక్తులు కార్టూన్లు మహాద్భుతంగా ఉన్నాయని తెగ మార్కులు ఇచ్చేశారు. ఈ పరిశోధన అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. సంతోషంగా ఉండటానికి ఒక సులువైన దారి దొరికిందంటూ జనం తెగ మురిసిపోయారు. కానీ ఇదే పరిశోధనను మళ్లీ ఇప్పుడు చేయడంతో కథ మొదటికి వచ్చింది.

 

ప్రపంచవ్యాప్త పరిశోధన

ఈసారి నెదర్లాండ్స్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు 1988 నాటి పరిశోధనని మరోసారి చేసి చూద్దామని ప్రయత్నించారు. అందుకోసం ‘స్ట్రాక్‌’ అనుమతిని తీసుకుని, ఆయన సలహాల మేరకు మరోసారి పరిశోధనని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఓ 17 పరిశోధనాశాలలలో 1,894 మంది అభ్యర్థుల మీద ఇదే పరిశోధనను నిర్వహించారు. కానీ ఈసారి ఫలితాలు మాత్రం పూర్తి భిన్నంగా వచ్చాయి. ఇతరులతో పోలిస్తే,  బలవంతంగా చిరునవ్వు పులుముకున్నవారు కార్టూన్లకి ఇచ్చిన మార్కులలో పెద్దగా మార్పులు రాలేదు. దీంతో 1988 నాటి ప్రయోగపు ఫలితాలు ఏదో అనుకోకుండా ఏర్పడినవి తేలిపోయింది.

 

 

నవ్వు సహజంగా రావాల్సిందే!

కుక్క తోకని నిరంతరం ఊపుతూనే ఉంటుంది. అంతమాత్రాన తోకే కుక్కని ఊపుతుందని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో... బలవంతపు చిరునవ్వుతో మనసు మారిపోతుందనుకోవడం అంతే మూర్ఖత్వం అంటున్నారు పరిశీలకులు. కానీ తన 1988నాటి పరిశోధన తప్పంటే ‘స్ట్రాక్‌’ ఒప్పుకోవడం లేదు. తాజా పరిశోధనలో చాలా లొసుగులు ఉన్నాయనీ, అందుకే ఒకప్పుడు నిరూపించిన ఫలితాలు ఇప్పుడు మారిపోయాయనీ వాదిస్తున్నారు.

 

ఈ దెబ్బతో బలవంతపు చిరునవ్వు గురించిన నమ్మకాలు చెదిరిపోయాయి. అయితే ఈ సందర్భంగా మన పెద్దవారు చెబుతూ వచ్చిన మాటలని మాత్రం గుర్తుకి తెచ్చుకోక తప్పదు. ఏ భావమైనా మనసులోంచి స్వచ్ఛంగా రావాలే కానీ తెచ్చిపెట్టుకుని ఉపయోగం లేదన్నది విజ్ఞుల మాట. మనసులో ఉన్న భావాలని అణచిపెట్టుకోవడం వల్ల అవి నశించిపోతాయనుకోవడం ఎంత తెలివితక్కువతనమో, పైకి కృత్రిమంగా వ్యక్తపరిచే భావాలు మనసుని ప్రభావితం చేస్తాయనుకోవడమూ అంతే మూర్ఖత్వం!

 

- నిర్జర.