ఫేస్‌బుక్‌తో ఆయుష్షు పదిలం


‘లేచిన దగ్గర్నుంచీ ఆ ఫేస్‌బుక్‌ ముందరే తగలడతారేంటి?’ అని భార్యలు తిట్టవచ్చుగాక! ‘పిదపకాలం పిదప పోస్టులు’ అంటూ పెద్దలు విసుక్కోవచ్చుగాక! కానీ ఫేస్‌బుక్‌ అంటే పడిచచ్చేవారికి సంతోషం కలిగించేలా ఓ పరిశోధన జరిగింది. ఫేస్‌బుక్‌తో జీవితకాలం పెరుగుతుందని సదరు పరిశోధన రుజువుచేస్తోంది.

 

12 శాతం ఎక్కువ

సామాజిక సంబంధాలు దృఢంగా ఉన్నవారు సుదీర్ఘకాలం బతుకుతారన్న విషయం ఇప్పటికే రుజువైంది. అయితే ఇది ఆన్‌లైన్‌లో సామాజిక వెబ్‌సైట్లకు ఎంతవరకు వర్తిస్తుందో తెలుసుకోవాలనుకున్నారు కొందరు పరిశోధకులు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాకు చెందిన ఫేస్‌బుక్‌ యూజర్ల జాబితాను సేకరించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ జాబితాలో ఉన్నవారి ఆరోగ్యం ఎలా ఉందో బేరీజు వేశారు. ఫలితం! ఫేస్‌బుక్‌ వాడేవారు ఇతరులతో పోలిస్తే 12 శాతం సుదీర్ఘకాలం జీవిస్తున్నట్లు తేలింది.

 

అకౌంట్‌ ఉంటే సరిపోదు

కేవలం ఫేస్‌బుక్‌ అకౌంటు ఉంటే సరిపోదు, అందులో చురుగ్గా పాల్గొంటున్నా సరిపోదు! పరిశోధకుల లెక్కల ప్రకారం వీలైనంతమంది ఎక్కువ ఫేస్‌బుక్ నేస్తాలు ఉన్నవారికే ఆయుష్షుపరంగా మేలు జరుగుతోంది. పైగా ఏదో నామమాత్రంగా పోస్టులు పెట్టడం, లైకులు కొట్టడం వల్ల ఉపయోగం లేదట. ఎక్కువమంది మిత్రులు ఉన్నవారు, ఆ మిత్రులతో తమ ఫొటోలను పంచుకుంటున్నవారే ఫేస్‌బుక్‌ వల్ల లాభపడుతున్నట్లు తేలింది.

 

కారణం!

ఈ పరిశోధన ఏదో వందలు, వేలమంది మీద జరిగింది కాదు. ఆషామాషీగా సాగిందీ కాదు. దాదాపు కోటిమందికి పైగా ఫేస్‌బుక్ యూజర్లను గమనించిన తరువాత తేల్చిన విషయం. సామాజికంగా దృఢమైన సంబంధాలు ఉన్నవారు ఇతరులకంటే ఎక్కువకాలం జీవిస్తారనే విషయం దాదాపు 35 ఏళ్ల క్రితమే రుజువయ్యింది. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఫేస్‌బుక్‌ కూడా మన సామాజిక బంధాలను కొలిచే ఒక సాధనంగా మారిపోయింది. ఇందులో ఏదో కొందరు నామమాత్రంగా పాల్గొంటే... నిజంగా నలుగురిలో కలిసే మనస్తత్వం ఉన్నవారు వీలైనంత ఎక్కువమంది స్నేహితులను ఆకర్షించడం, తమ ఫొటోలను వారితో పంచుకోవడం చేస్తుంటారు. సహజంగానే ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, చొరవా, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి దృక్పథం వారి ఆరోగ్యం మీద కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అదే వారి సుదీర్ఘమైన ఆయుష్షుకి కారణం అంటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనకి మనం కూడా ఒక లైక్‌ కొడదాం మరి!

 

- నిర్జర.