పాక్-అమెరికా డీల్ చెడింది..!

 

పాకిస్తాన్-అమెరికా ఫేవికాల్ బంధం గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇప్పుడు ఈ బంధానికి పెద్ద దెబ్బ తగిలింది. ఉగ్రవాదంపై పోరాటం చేస్తామనే సాకు చెప్పి అమెరికా ఆర్థిక సాయంతో రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నపాకిస్తాన్ ఆశలపై అమెరికా కాంగ్రెస్ నీళ్లు చల్లింది. దేశంలో రక్తపుటేరులు పారిస్తున్న తాలిబన్లను ఎదుర్కోవాలంటే అత్యాధునిక ఆయుధాలు అవసరమని పాక్ ప్రభుత్వం భావించింది. అందుకే తనకు అత్యంత మిత్రదేశం అయిన అమెరికా నుంచి ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి కొద్ది కాలం క్రితం అగ్రరాజ్యంతో చర్చలు జరిపింది. పాక్‌కు ఎఫ్-16 విమానాలు విక్రయించేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం అంగీకరించారు.

 

దీని మొత్తం విలువ 270 కోట్ల అమెరికన్ డాలర్లు. ఈ ఆర్డర్‌లో సగం పాకిస్తాన్ చెల్లించాలి..మిగతా సగం అమెరికా తన మిత్రదేశాలకు చేసే సైనిక సహాయనిధి నుంచి చెల్లించేలా ఒప్పందం కుదిరింది. మొదట మొత్తం 18 ఎఫ్-16 యుద్ధ విమానాలు కావాలని పాక్, అమెరికాను కోరింది. అయితే ఆర్ధికపరమైన సమస్యల కారణంగా ఎనిమిది విమానాలను మాత్రమే విక్రయిస్తామని అగ్రరాజ్యం తేల్చిచెప్పింది. ఇందులో కూడా సగం ధరకే ఎఫ్-16 విమానాలు అందుతుండటంతో పాక్ ఎగిరిగంతేసింది. ఇక్కడతో కథ అవ్వలేదు ఈ బప్పందానికి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపినప్పటికి అతి శక్తివంతమైన సెనేట్ విదేశీ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ బాబ్ కార్కర్ నేతృత్వంలోని సెనేటర్ల బృందం ఈ ఒప్పందానికి అడ్డుకట్ట వేసింది.

 

 ఇందుకు కారణం లేకపోలేదు..ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉగ్రవాదంపై కాకుండా తమకు వ్యతిరేకంగా గురిపెడుతుందని అందువల్ల ఈ డీల్‌పై పునరాలోచించాలని భారత్, అమెరికాను కోరింది.  పాకిస్తాన్ నమ్మదగిన మిత్రుడు కాదని, ఒసామా బిన్ లాడెన్‌ను అంతమొందించడంలో సాయపడిన ఒక వైద్యుడిని పాక్ ప్రభుత్వం వేధిస్తోందని సెనేటర్లు వాదించారు. మరీ ముఖ్యంగా దేశంలోని హక్కానీ నెట్‌వర్క్‌పై పాక్ చర్యలు శూన్యమని కమిటీ సూచించింది. ఈ కారణాలతో అమెరికా జాతీయ నిధి నుంచి నిధులను వినియోగించడానికి తాము అంగీకరించమని కమిటీ తేల్చి చెప్పింది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోని ఒబామా సర్కార్ సొంత నిధులతోనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని పాక్ ప్రభుత్వానికి సూచించింది. ఎఫ్-16 యుద్ధ విమానాలను తక్కువ ధరకు ఇవ్వలేమని తెగేసి చెప్పింది.

 

ఊహించని ఈ పరిణామంతో షాక్ తిన్న పాకిస్తాన్, అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఈ వ్యవహారంపై పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ ఘాటుగా స్పందించారు. అగ్రరాజ్యం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ఒక వేళ అమెరికా యుద్ధ విమానాల కోసం ఇస్తున్న సబ్బీడీ ఎత్తివేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే తాము ఎఫ్-16 యుద్ధ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. పాకిస్తాన్‌లో నెలకొని ఉన్న పేదరికం, మౌలిక సదుపాయాల కల్పనకు అమెరికా ఉదారంగా నిధులిచ్చింది. అయితే ఏ సాయాన్ని అయినా భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించడానికే పాక్ ప్రణాళిక రచిస్తూ వస్తుంది. ఇది అమెరికాకు తెలిసినప్పటికి పాక్‌తో ఉన్న అవసరం దృష్ట్యా చూసి చూడనట్లు వదిలివేస్తోంది.

 

ఒకప్పటితో పోలిస్తే పాక్-అమెరికా బంధం అంత గట్టిగా ఏం లేదు. ఇటీవల నాటో దళాలు జరిపిన దాడుల్లో 24 మంది పాకిస్తాన్ సైనికులు మరణించడంతో..పాక్-అమెరికా సంబంధాలపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. తమ దేశ సార్వభౌమత్వానికి, గౌరవానికి భంగం వాటిల్లనంతవరకు అమెరికాతో సంబంధాలు కొనసాగించాలనే తాము కోరుకుంటున్నామని ఆ దేశ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. పాక్ సైనికులను చంపడం, లాడెన్‌ను హతమార్చేందుకు పాక్ భూభాగంలో దాడులు జరపడం పట్ల పాక్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఆఫ్ఘన్‌లోని ఒక మిలటరీ క్యాంప్‌పై ఉగ్రదాడి వెనుక పాక్ గూడఛార సంస్థ ఐఎస్ఐ ఉన్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ దాడిలో సీఐఏ ఏజెంట్లు, పాత్రికేయులు, ప్రజలు ఉన్నారని పేర్కొంది. ఇలా ప్రతి విషయంలోనూ అమెరికా, పాక్ మధ్య మనస్పర్ధలు కామన్ అయ్యాయి. అగ్రరాజ్య తీరు కారణంగా పాక్ , చైనాకు మరింత దగ్గరయ్యే పరిస్థితి కనిపిస్తుంది. మరి అమెరికా అంత వరకు రానిస్తుందా? తన మిత్రుడిని వదులుకుంటుందా? అనేది వేచి చూడాలి. మొత్తానికి ఈ డీల్ క్యాన్సిల్ కావడం భారత్‌కు ఒకింత మేలే. అదే అమెరికా నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎఫ్-16 విమానాలు దిగినట్లైతే భారత్ తక్షణమే అప్రమత్తమై ఉండాల్సి వచ్చేది.