ఏపీ కొత్త రాజధాని కర్నూల్.. కాదు కాదు తిరుపతి!!

posted on: Aug 21, 2019 2:34PM

 

నిన్న ఎపి పురపాలక శాఖా మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో రాజధాని అమరావతి నుండి మరో ప్రాంతానికి మారుస్తారా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ విషయంలో అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. కొంతమంది రాజధాని దొనకొండకు మార్చవచ్చని చెపుతుండగా తాజాగా కొంత మంది రాజకీయ నాయకులు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ దీని పై స్పందిస్తూ రాజధానిని మార్చాలని నిర్ణయిస్తే అన్ని వసతులు ఉన్న తిరుపతిని రాజధాని చేయాలని అలాగే దొనకొండ రాజధానిగా ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఏది ఏమైనా జగన్ ప్రభుత్వం వైఖరితో రాజధానికి స్వచ్చందంగా భూములిచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే క్లారిటీ ఇవ్వాలని అయన అన్నారు.

ఇదే విషయం పై మాట్లాడుతూ కర్నూల్ జిల్లా పాణ్యం వైసిపి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కర్నూల్ ను రాజధాని చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కర్నూల్ రాజధానిగా ఉండేదని అయన గుర్తు చేసారు. ఆ తరువాత రాజధాని కోల్పోవడంతో కర్నూల్ అభివృద్ధి లో వెనుక పడిందన్నారు. రాజధాని విషయమై శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబునాయుడు ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన వెంటనే ఈ విషయమై ఆయనను కలిసి తమ అభిప్రాయం చెపుతామన్నారు. అమరావతి నుండి రాజధానిని మారిస్తే కనుక కర్నూల్ లో ఏర్పాటు చేయాలని కోరతానని ఒకవేళ రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తే కర్నూల్ లో హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చూద్దాం రాజధాని మార్పు అనే తేనె తుట్టెను కదిపిన వైసిపి సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో.

google-ad-img
    Related Sigment News
    • Loading...