ఐరోపాలో రాజకీయ కల్లోలం "బ్రెగ్జిట్"

యూరోపియన్ యూనియన్‌తో గత 43 ఏళ్లుగా కొనసాగిస్తున్న బంధాన్ని..బ్రిటన్ తెంచుకోబోతోందన్న వార్తలతో ఐరోపా సమాజం కలవరపాటుకు గురైంది. ఈ పరిణామం ప్రపంచ రాజకీయాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర దుష్ప్రభావం చూపించనుందని వీశ్లేషకులు భావిస్తున్నారు. అసలు బ్రిటన్ ఈయూ నుంచి ఎందుకు వైదొలగాలనుకుంటోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా ఖండంలోని ప్రధాన ఆర్ధిక శక్తులన్నీ యుద్దాల బాట పట్టకుండా రాజకీయంగా, ఆర్ధికంగా పరస్పరం సహకరించుకునేందుకు యూరోపియన్ యూనియన్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. తొలినాళ్లలో దీనిలో చేరేందుకు బ్రిటన్ సుముఖత చూపలేదు. దీని వల్ల ఒనగూరే ప్రయోజనాలను బేరిజు వేసుకున్న యూకే మనసు మార్చుకుని 1973లో ఈయూలో చేరింది. దీనిని వ్యతిరేకించిన లేబర్‌పార్టీ అధికారంలోకి రాగానే 1975లో రిఫరెండం నిర్వహించింది. అప్పట్లో బ్రిటన్ ప్రజలంతా దీనికి ఆమోదం తెలిపారు.

 

మళ్లీ ఇన్నాళ్టీకి ఈయూ సభ్యత్వంపై బ్రిటన్‌లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈయూ ఒప్పందాల వల్ల సభ్య దేశాల ప్రజలు ఐరోపా ఖండంలో ఏ దేశం వారైనా వేరే దేశంలో ఉపాధి నిమిత్తం వలస వెళ్లొచ్చు.  బలమైన ఆర్ధిక వ్యవస్థ కావడం, ఉపాధి అవకాశాలకు కొదవలేకపోవడంతో ఐరోపా ఖండంలోని చాలా దేశాల ప్రజలు బ్రిటన్‌కు వలస వస్తున్నారు. ఒక్క పోలండ్ నుంచే దాదాపు 10 లక్షల మంది బ్రిటన్‌లోకి వచ్చి ఉంటారని అంచనా. ఈ జనాలు బ్రిటన్ జనాలతో పోలిస్తే నైపుణ్యంలో ఎక్కడో ఉంటారు. ఇలాంటి వారంతా యూకేలోకి రావడంతో వేతనాలు పడిపోతున్నాయి. ఈ పరిణామం సగటు పౌరుడిలో అసహనాన్ని కలిగిస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే సిరియా, ఇరాన్‌లో అంతర్యుద్ధం కారణంగా లక్షలాది మంది శరణార్థులు ఐరోపా బాట పడుతున్నారు. అందులోనూ బ్రిటన్‌వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

 

వీరి నియంత్రణను ఈయూ పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో ఎక్కడో బ్రస్సెల్స్‌లో ఉండే ఈయూ కోర్టు తీర్పులు, నిర్ణయాలకు తలొగ్గాల్సి వస్తుండటం బ్రిటన్‌కు పెను భారంగా తయారవుతోంది. ఈ పరిణామాలను ఒక కంట కనిపెడుతూనే ఉన్న బ్రిటన్ పౌరులు తమ దేశం వేరేవాళ్ల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయిందని, దీని వల్ల తమకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి నెలకొందని, పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు తీవ్రవాద దాడులు ఎక్కువవుతున్నాయని..పారిశ్రామిక రంగంలో కూడా తీవ్ర నిరాశాపూరిత వాతావరణం నెలకొందని..ఇలా పలు రకాలుగా ఆందోళనలో కూరుకుపోయారు. ఇదిలా ఉండగా ఈ పరిణామం క్రమంగా రాజకీయరంగు పులుముకుంది. 2010లో కంజర్వేటివ్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు యూకే స్వతంత్ర పార్టీతో చేయి కలిపింది. ఈ సమయంలో ఈయూ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేందుకు మద్ధతు పలికితేనే తాము సంకీర్ణంలో చేరతామని యూకేఐపీ షరతు పెట్టింది.

 

రాజకీయ అవసరాల కోసం డేవిడ్ కామెరూన్ దానికి అంగీకరించారు. అయితే బ్రిటన్‌ను బయటకు తీసుకురాకుండా కొన్ని ప్రత్యేక మినహాయింపుల కోసం కామెరూన్ మధ్యేమార్గంగా ఐరోపా యూనియన్‌తో చర్చలు జరుపుతున్నారు. ఈయూ దేశాల నుంచి వలస వచ్చే వారి నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలన్నది కీలక డిమాండ్. దీనిని తూర్పు ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాకుండా కామెరూన్ సొంతపార్టీ నేతలు కూడా విడిపోవడానికే మొగ్గు చూపుతున్నారు.  సరిగ్గా గతేడాది 309 ఏళ్లుగా బ్రిటన్‌లో భాగంగా కొనసాగుతున్న స్కాట్లాండ్..వేరు కుంపటి పెట్టుకునేందుకు సిద్ధమైంది. బ్రిటన్ నుంచి తమకు స్వతంత్రం కావాలంటూ...స్కాటిష్ నేషనల్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. విడిపోతే చేడిపోతామంటూ ప్రధాని కామెరూన్ వేర్పాటువాదుల్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. చివరికి తీవ్ర ఉత్కంఠ నడుమ నిర్వహించిన రిఫరెండంలో స్కాట్లాండ్‌ పౌరులు బ్రిటన్‌తో కలిసి ఉండేందుకే మొగ్గు చూపడంతో యూకే ముక్కలు కాలేదు.

 

అచ్చం ఇప్పుడు అలాంటి పరిస్ధితిలోనే ఉన్న ప్రధాని కామెరూన్..ఈయూ నుంచి విడిపోతే దేశం బలహీనపడి అస్థిరతకు దారి తీస్తుందని, తిరిగి కొలుకొనేందుకు చాలా కాలం పడుతుందని..ధరలు పెరిగి..ఉపాధి అవకాశాలు కుదించుకుపోయి..శాశ్వాత పేద దేశంగా మిగిలిపోతాం. ఇవన్నీ తెలిసి కూడా ఈయూ నుంచి వైదొలగాలని ఎందుకు ఓటు వేస్తాం అంటూ ఆయన దేశప్రజలనుద్దేశిస్తూ టెలిగ్రాఫ్ పత్రికలో వ్యాసం రాశారు. ఈయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత భవిష్యత్ ఏమిటో తెలియకుండా విడిపోవడం మంచిది కాదని, దీని వల్ల ప్రపంచ వాణిజ్య, వ్యాపార రంగాలన్నీ సంక్షోభంలో పడిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఈయూ సభ్య దేశాలు కూడా బ్రిటన్ విడిపోవటాన్ని ఒప్పుకోవడం లేదు. ఈయూలో రెండో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థతో పాటు అతిపెద్ద సైనిక శక్తి కూడా కావడంతో ఇది ఏమాత్రం మంచిది కాదని ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలన్నీ వారిస్తున్నాయి. మొత్తానికి ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ కొనసాగుతుందా..? వైదొలగుతుందా అన్నది 23న నిర్వహించనున్న రిఫరెండంలో తేలిపోనుంది.