కేసీఆర్ చరిత్ర బయటపెట్టిన ఈటల 

posted on: May 4, 2021 7:28PM

మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు స్పష్టిస్తోంది. గంట గంటకు సమీకరణలు మారిపోతున్నాయి. మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై తొలిసారి స్పందించిన కరీంనగర్ టీఆర్ఎస్ నేతలు.. ఈటలను టార్గెట్ చేశారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనపై మంత్రులు ఆరోపణలు చేయడంతో మరింత దూకుడు పెంచారు ఈటల రాజేందర్. కేసీఆర్ తో అమీతుమీకి సిద్ధమవుతున్న రాజేందర్.. ఒక్కొక్కటిగా సంచలనాలు బయటపెడుతున్నారు. కేసీఆర్ చరిత్రను బయటపెడుతున్నారు. 

త‌న‌ వ్య‌వ‌హారం న‌చ్చ‌క‌పోతే త‌న‌ను పిలిపించి అడిగితే టీఆర్ఎస్‌ పార్టీ కోరితే తానే రాజీనామా చేసేవాడినని  ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. అంతేగానీ, ఇంత క‌క్ష సాధించడం అవ‌స‌ర‌మా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను త‌ప్పు చేస్తే విచార‌ణ జ‌రిపించాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశాన‌ని చెప్పారు.ఇప్పుడు త‌న‌ను విమ‌ర్శిస్తున్నవారంతా త‌న స‌హ‌చ‌రులేన‌ని ఈటల గుర్తు చేశారు. తెలంగాణ గాంధీగా పేరు గాంచిన వ్య‌క్తి ఇప్పుడు క‌క్ష పూరితంగా వ్య‌వ‌హరిస్తున్నారని విమ‌ర్శించారు. ఎవ‌రో ఇస్తున్న త‌ప్పుడు స‌ల‌హాలు, నివేదిక‌ల వ‌ల్ల నాపై క‌క్ష సాధిస్తున్నారని ఈటల ఆరోపించారు.

అస‌లు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎంను క‌లిసే అవ‌కాశం కూడా మంత్రుల‌కు ఉండ‌ద‌ని రాజేందర్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. సీఎంకు ఆరోగ్యం బాగోలేద‌ని తెలిసి మంత్రులు ఆయ‌న‌ను క‌ల‌వ‌డానికి వెళ్లార‌ని, అయితే ఆయ‌న‌ను క‌లిసేందుకు అనుమ‌తించలేద‌ని చెప్పారు. తెలంగాణ రాకముందు వ‌ర‌కే కేసీఆర్‌.. ప్ర‌జ‌ల‌ను, ధ‌ర్మాన్ని న‌మ్ముకున్నార‌ని, ఆ త‌ర్వాత మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. 2014 నుంచి ప్రజా సంక్షేమం కోసం తాను ఎలా ప‌ని చేశానో ప్ర‌జ‌లంద‌రికీ తెలుసని చెప్పారు.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తాము ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి ఎంతో సాయాన్ని అందించామ‌ని ఈటల తెలిపారు. 2015లో తాను క‌రీంన‌గ‌ర్ స‌మ‌స్య‌ల గురించి వివ‌రించడానికి సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి తొమ్మిది మంది ఎమ్మెల్యేల‌తో క‌లిసి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లాన‌ని, సీఎంను క‌ల‌వ‌కుండా నిలువ‌రించార‌ని చెప్పారు. బ‌య‌ట అంతా మీడియా వాళ్లు ఉన్నార‌ని, వారు చూస్తున్నార‌ని, సీఎంను క‌ల‌వ‌నివ్వ‌క‌పోయినా ఒక్క‌సారి లోప‌లికి వెళ్లి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తామ‌ని చెప్పామ‌ని వెల్ల‌డించారు.

క‌నీసం అలా చేయ‌పోతే మీడియా ముందు త‌మ సిగ్గుపోతుంద‌ని చెప్పుకున్నామ‌ని అయిన‌ప్ప‌టికీ లోప‌లికి వెళ్లే అవ‌కాశం కూడా ఇవ్వ‌లేద‌ని టల రాజేందర్ వివ‌రించారు. ఆ స‌మ‌యంలో స‌హ‌చ‌ర నేత‌ గంగుల క‌మ‌లాక‌ర్‌కు కోపం వ‌చ్చింద‌ని, ఇంత అహంకార‌మా? అని అన్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇటువంటివి చాలా ఉన్నాయ‌ని అవి చెప్ప‌లేమ‌ని అన్నారు. త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని తాను టీఆర్ఎస్ నేత‌ల‌ను అడ‌గ‌డం లేద‌ని చెప్పారు ఈటల రాజేందర్. కేసీఆర్ పై చేసిన తాజా వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. త్వరలో మరిన్ని సంచలన విషయాలు కేసీఆర్ బయటపెడతారనే చర్చ జరుగుతోంది. దీంతో ఈటల ఎపిసోడ్ ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన గులాబీ నేతల్లో కనిపిస్తోందని చెబుతున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...