రైతుల అలక దీక్షతో టీఆర్ఎస్ కు చెమటలు

 

నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని.. విపక్షాలను ఎదుర్కోవడంలో టీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ ఎప్పుడూ ముందుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అధికార పార్టీ రైతుల ఆత్మహత్యల సమస్యతో సతమతమవుతుంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి అధికార పార్టీని ఇరుకున పెడదామనే ప్లానింగ్ లో ఉన్నాయి. దీనిలో భాగంగానే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రైతు ఆత్మహత్యలపై అక్బరుద్దీన్ మాట్లాడి అధికార పార్టీకి చుక్కలు చూపించారు. ఇప్పుడు దీనికి తోడు వారికి మరో తలనొప్పి వచ్చిపడింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా రైతులు అలక దీక్ష చేపట్టారు. అది ఎవరో కాదు కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న గ్రామ రైతులే దీక్షకు పూనుకున్నారు. ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ దీక్షకు నేతృత్వం వహించింది.. కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి కోసం గడ ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ ఓఎస్డీ అశోక్ కుమార్. ఆయన రైతుల పక్షాన నిలిచి నిరసన వ్యక్తం చేయటంతో ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి.

దీంతో ఇప్పటికే ఈ వ్యవహారంలో సమస్యలు ఎదుర్కొంటున్నకారణంగా ఇప్పుడు ఈ విషయం ప్రచారం అయితే ఇంకా తలనొప్పులు తప్పవని గుర్తించిన ప్రభుత్వ అధికారులు ఉరుకులు పరుగులు తీసుకుంటూ అక్కడి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. కాగా అక్కడికి వచ్చిన అధికారులకు అశోక్ కుమార్ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో సరికొత్త కారణాలు చెప్పారు. రైతులకు న్యాయం జరిగే వరకూ తాను దీక్షను విరమించనని మొండికేశారు. అయితే ఆయన్ను ఎలాగొలా బుజ్జగించి దీక్షను విరమించే సరికి అధికారుల తల ప్రాణం తోకకి వచ్చినంత పనైంది. ఏది ఏమైనా రైతుల ఆత్మహత్యల అంశం టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆడుకుంటున్నట్టుంది.